ఏపీలో రూ.1500 కోట్లతో మరో భారీ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టెందుకు శ్రీసిమెంట్ కంపెనీ ముందుకొచ్చింది. రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేయనున్నారు. ఫ్యాక్టరీ ఎమ్డీ హెచ్ఎం బంగూర్, జెఎండి ప్రశాంత్ బంగూర్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం బంగూర్ మాట్లాడుతూ తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటికే తమ ప్యాక్టరీ యూనిట్లు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో తొలి యూనిట్ ఏర్పాటు అవుతుందని తెలిపారు. ఉపాధి పొందేవారికి సరాసరిన రూ.70 లక్షలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. సిమెంటు ఫ్యాక్టరీల వల్ల ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఉండేవారికి మంచి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి, శ్రీసిమెంట్ ప్రెసిడెంట్ సంజయ్ మెహతా, జిఎం జివిఎస్ శ్రీధర్‌రాజు, మేనేజర్ వెంకటరమణ, అసిస్టెంట్ మేనేజర్ సింహాద్రి చంద్రశేఖర్ ఉన్నారు.






