వైభవంగా మహా శివరాత్రి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేశారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువ జామున నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్థరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారి కల్యాణం నిర్వహించారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీచాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.