IDPL Lands: ఐడీపీఎల్ భూములపై రాజకీయ రగడకు విచారణతో చెక్..!?
హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ఐడీపీఎల్ (Indian Drugs and Pharmaceuticals Limited) భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ భూముల ఆక్రమణలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో, రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వేల కోట్ల విలువైన ఈ భూములపై విజిలెన్స్ (Vigilance) విచారణకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఐడీపీఎల్ భూములు, ముఖ్యంగా సర్వే నెంబర్ 376లో భారీ ఎత్తున ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ దాదాపు రూ.4,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని వస్తున్న వార్తలపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ క్రమంలోనే ఐడీపీఎల్ భూముల్లో అసలేం జరిగింది? ఎంత మేర ఆక్రమణకు గురైంది? దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు? అనే అంశాలను నిగ్గు తేల్చడానికి విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అధికారుల రిపోర్టు ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి, రాజకీయంగా ఇంతటి ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తీవ్రమైన ఆరోపణలే అని చెప్పాలి. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఐడీపీఎల్ భూముల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతోనే కబ్జాలు జరుగుతున్నాయని పరోక్షంగా మాధవరం కృష్ణారావును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కంచె చేను మేసినట్లుగా రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారని ఆమె ఆరోపించారు. బతుకమ్మ కుంట సహా పలు ప్రాంతాల్లో మట్టిని డంప్ చేసి భూములను చదును చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలే ప్రభుత్వ స్పందనకు, తాజా విచారణకు నాంది పలికాయి.
ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన వెంటనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘాటుగా స్పందించారు. ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఐడీపీఎల్ భూములపై విచారణ జరిపించాలని నేనే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కోరాను. ఇప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశించినందుకు సీఎంకు ధన్యవాదాలు అని మాధవరం పేర్కొన్నారు. తనపై ఆరోపణలు రావడం కొత్తేమీ కాదని, గత 20 ఏళ్లుగా గిట్టని వారు బురద చల్లుతున్నారని ఆయన అన్నారు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. కేవలం విజిలెన్స్ మాత్రమే కాదు, అవసరమైతే సీబీఐతో గానీ, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విచారణతోనైనా నిజానిజాలు బయటకు వచ్చి, తనకు ఒక క్లారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐడీపీఎల్ భూముల వ్యవహారం ఇప్పుడు బహుముఖ పోరుగా మారింది. ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ దీనిని అస్త్రంగా మలచుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తుంటే, మరోవైపు అధికార పార్టీ విచారణ ద్వారా నిజాలను వెలుగులోకి తీసుకురావాలనుకుంటోంది. రూ.4 వేల కోట్ల ప్రజాధనం ముడిపడి ఉన్న ఈ భూముల విషయంలో విజిలెన్స్ అధికారులు ఎలాంటి రిపోర్టు ఇస్తారు? ఆ రిపోర్టు ఆధారంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో ఐడీపీఎల్ భూముల వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో మరింత హీట్ పెంచడం ఖాయం.






