Donald Trump: బీబీసీపై 90 వేల కోట్లకు ట్రంప్ పరువు నష్టం దావా..!
పొరపాటో, గ్రహపాటో తెలియదు కానీ.. క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన బీబీసీ.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడింది. తప్పైంది…సారీ అని బీబీసీ క్షమాపణలు చెప్పినా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వదలడం లేదు. తనపై అంత దారుణంగా వార్త ప్రసారం చేసిన బీబీసీపై.. ఏకంగా 90వేల కోట్లకు పరువునష్టం దావా వేశారు ట్రంప్.
అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా 2021లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసిన బీబీసీ (BBC) .. తీవ్రస్థాయిలో చిక్కుల్లో పడింది. తన ప్రసంగాన్ని సవరించి ప్రజలను తప్పుదారి పట్టించిందని ఆరోపిస్తూ.. 10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.90వేల కోట్లు) నష్టపరిహారం డిమాండ్ చేశారు (Trump sues BBC).
మియామిలోని ఫెడరల్ కోర్టులో 46 పేజీలతో ఈ దావా వేశారు. శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన తన ప్రసంగాన్ని రెండుచోట్ల సవరించి ఉద్వేగభరితంగా మార్చారని ట్రంప్ ఆరోపించారు. తన పరువుకు నష్టం కలిగించడంతో పాటు ఫ్లోరిడా చట్టాలను ఉల్లంఘించి అన్యాయమైన వ్యాపార విధానాలు పాటిస్తోందని అందులో వాదించారు. ఈ రెండు ఆరోపణలపై ఒక్కొక్కదానికి 5 బిలియన్ డాలర్ల చొప్పున నష్టపరిహారం డిమాండ్ చేశారు.
2021 జనవరి 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌పై తన మద్దతుదారులు దాడులు చేసిన సందర్భంగా ట్రంప్ సుమారు గంట పాటు ప్రసంగించారు. దీనిని తన పనోరమ డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుగా మార్చి ప్రసారం చేసింది. అందులో ‘క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. మీతో పాటు నేనూ అక్కడికి వస్తున్నా. మనం పోరాడదాం. ఘోరంగా పోరాడదాం’ అన్నట్లుగా ఉంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రంప్ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో.. బీబీసీకి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది.






