విశాఖ టు సింగపూర్ విమాన సర్వీసులు
విశాఖ నుంచి నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 29 నుంచి వారానికి మూడు సార్లు సింగపూర్‌కు విమాన సర్వీసులు నడపడానికి స్కూట్ ఎయిర్‌లైన్స్ ముందుకు వచ్చిందని విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కేఎస్ రావు తెలిపారు. ప్రతి బుధ, శుక్ర, ఆదివారం ఉదయం 10 గంటలకు సింగపూర్ నుంచి విశాఖకు వచ్చి.. 11 గంటలకు తిరిగి సింగపూర్‌కు విమానం బయలుదేరుతుందన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కొవిడ్‌కి ముందు మలేషియా, దుబాయ్, సింగపూర్, శ్రీలంక దేశాలకు విశాఖ నుంచి విమాన సర్వీసులు ఉండేవి. కోవిడ్ భయం తగ్గితే మిగిలిన ఎయిర్‌లైన్స్ కూడా సర్వీసులు ప్రారంభిస్తాయన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో విశాఖ విమానాశ్రయానికి రోజుకు పదివేల మందికి పైగా ప్రయాణికులు వస్తుంటే అంతర్జాతీయ సర్వీసులు లేకపోవడంతో ఇప్పుడు సగటున 7,000 మంది వరకు వస్తున్నారు.






