Satyakumar: ధర్మవరం విద్యార్థులకు సత్యకుమార్ ఇచ్చిన ప్రోత్సాహం ..
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) ఇటీవల తీసుకున్న ఒక మంచి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ (BJP) తరఫున మంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన, తక్కువ సమయంలోనే తన పనితీరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) దృష్టిని ఆకర్షించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ పార్టీ హైకమాండ్‌లో ఉన్న తన ప్రభావంతో మంత్రి పదవి పొందిన సత్యకుమార్, గత 18 నెలల్లో చూపించిన పని తీరు కూడ ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది.
ఇటీవల సత్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం విద్యార్థుల హృదయాలను గెలుచుకుందనే చెప్పాలి. ధర్మవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న అందరి విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజులు తాను చెల్లిస్తానని ఆయన ప్రకటించారు. మొత్తం 2,087 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఒక్కొక్కరి ఫీజు రూ.125 చొప్పున మొత్తం రూ.2,60,875ను సత్యకుమార్ స్వయంగా సమకూర్చారు. ఈ విషయాన్ని అధికారికంగా విద్యాశాఖకు లేఖ రాసి తెలియజేయడంతో పాటు, అవసరమైన మొత్తాన్ని జిల్లా విద్యా శాఖ ద్వారా చెల్లించించారు.
ధర్మవరం నియోజకవర్గంలో బత్తలపల్లి (Battulapalli), ముదిగుబ్బ (Mudigubba), తాడిమర్రి (Tadimarri) వంటి మండలాల్లో మొత్తం 41 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఇది పెద్ద సహాయంగా మారింది. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడే కుటుంబాలకు మంత్రి ఇచ్చిన ఈ సహాయం ఎంతో ఉపశమనంగా మారింది. మంత్రి యిచ్చిన సాయం తర్వాత విద్యార్థుల వద్ద నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయొద్దని జిల్లా విద్యాధికారి డీఈవో (DEO) అన్ని స్కూళ్లకు ప్రత్యేకంగా సూచనలు పంపారు.
చదువు పట్ల యువతలో ఆసక్తి పెంచాలని, ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల పిల్లలు వెనుకపడకూడదనే ఉద్దేశంతో ఇలాంటి చొరవ తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (Mega PTM) రోజునే ఈ మొత్తాన్ని చెల్లించడం కూడా ప్రత్యేకతగా నిలిచింది.
కూటమి ప్రభుత్వంలోని పలువురు మంత్రులు తమ వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న సందర్భంలో సత్యకుమార్ చేసిన ఈ చర్య మరింత ప్రశంసలు అందుకుంది. ఇటీవల పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripet) లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా స్కూళ్లకు పుస్తకాలు, కంప్యూటర్లు తన సొంత డబ్బుతో అందిస్తానని ప్రకటించడం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇలా ప్రజలకు దగ్గరగా ఉండే నిర్ణయాలు తీసుకుంటూ సత్యకుమార్ యాదవ్ తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






