YCP: వైసీపీ నేతలు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారా..!?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) వైసీపీ (YCP) ఘోర పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. 2019లో 151 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికల్లో ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయింది. అందుకే అసెంబ్లీని కూడా బాయ్‌కాట్ చేసింది. ప్రభుత్వాన్ని ప్రజల మధ్యే ప్రశ్నిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అడపాదడపా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తున్నారు.
జగన్ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నించడంపై టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తుంటారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, ప్రజలు 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇలా అహంకారం ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ సీట్లు కూడా దక్కవని హెచ్చరిస్తుంటారు. తాజాగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) రాజంపేట పర్యటనలో కూడా జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా..? చర్చించేందుకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు సిద్ధమా.. సిద్ధమా.. అని తనను ప్రశ్నించారని, ఇప్పుడు వాళ్లను కూడా అదే అడుగుతున్నానని చంద్రబాబు అన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు.
చంద్రబాబు సవాల్ పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీ వస్తారని, దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేందుకే తాము హోదా అడుగుతున్నామన్నారు. జగన్ ప్రెస్ మీట్ లో అడిగే ప్రశ్నలకే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని, ఇక అసెంబ్లీలో అడుగు పెడితే తట్టుకుంటుందా అని సజ్జల ఎద్దేవా చేశారు.
అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారంటూ వైసీపీ నేతలు చెప్తున్న మాటలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. కనీసం 10శాతం సీట్లు దక్కినప్పుడే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఇది ఆనవాయితీగా వస్తోంది. వైసీపీకి 10 శాతం సీట్లు అంటే కనీసం 18 సీట్లు కూడా రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రజలు ఆ హోదా కూడా ఇవ్వాలనుకోలేదు కాబట్టే వైసీపీకి దక్కలేదని, ప్రతిపక్ష హోదా ఇచ్చేది మేం కాదు.. ప్రజలని టీడీపీ నేతలు అంటున్నారు. అయినా ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువ సమయం దక్కుతుంది.. లేకుంటే తక్కువ సమయం కేటాయిస్తారనేది అవగాహనా రాహిత్యం అని ఎద్దేవా చేస్తున్నారు. పార్టీకి దక్కిన సీట్లను బట్టి దామాషా పద్ధతిలో ఆయా సభ్యులకు మాట్లాడే సమయం కేటాయిస్తారు. ఈ విషయం కూడా తెలీకుండా వైసీపీ నేతలు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.







