Rammohan Naidu: పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలపై.. మంత్రి సమీక్ష
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) దృష్టి సారించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ ఆయన విమానాశ్రయంలోనే గడిపారు. నిన్న బెంగళూరు (Bangalore) విమానాశ్రయంలో కార్యక్రమం పూర్తి చేసుకుని సాయంత్రం మంత్రి ఢిల్లీకి వచ్చారు. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏటీసీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) విమానాశ్రయంతో పాటు పలు చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఇవాళ ఉదయం నుంచే అధికారులతో రామ్మోహన్నాయుడు సమీక్ష చేపట్టారు. సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు అన్ని అంశాలపై ఎయిర్ పోర్టు అథారిటీ, డీజీసీఏ, విమానాశ్రయ అధికారులతో చర్చించారు. ఢిల్లీసహా పలు చోట్ల సమస్యలు తలెత్తి విమానాలు ఆలస్యం అవుతుండటంతో రామ్మోహన్ నాయుడు మాల్దీవుల పర్యటన రద్దు చేసుకున్నారు.







