Sakshi: పైసా మే ప్రమోషన్ కథనం కలకలం .. సాక్షి కార్యాలయంలో అర్థరాత్రి పోలీసుల సోదాలు
విజయవాడ (Vijayawada) లోని ఆటోనగర్ (Autonagar) ప్రాంతంలో ఉన్న సాక్షి మీడియా (Sakshi Media) ప్రధాన కార్యాలయం మంగళవారం తెల్లవారుజామున హాట్ టాపిక్ గా మారింది. అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులు అకస్మాత్తుగా ఆఫీసులోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ చర్యలు మంగళవారం ఉదయం 2 గంటల వరకు కొనసాగాయి. ఆ సమయానికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాడేపల్లి (Tadepalli) పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసు ఆధారంగా ఈ శోధనలు చేపట్టినట్లు సమాచారం. సాక్షి పత్రిక ఎడిటర్‌తో పాటు అక్కడ పనిచేస్తున్న కొంతమంది జర్నలిస్టులపై కూడా పోలీసులే ఫిర్యాదు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం మీడియా వర్గాలను ఆందోళనకు గురి చేసింది.
సాక్షి ప్రధాన కార్యాలయంలో అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనపై స్థానిక పాత్రికేయులు తీవ్రంగా స్పందించారు. మీడియాలో స్వేచ్ఛను అణచివేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఇలాంటి చర్యలు చేపట్టారని వారు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు తగవని అభిప్రాయపడ్డాయి. మరోవైపు సాక్షి ప్రతినిధులు తమపై పెట్టిన కేసులు పూర్తిగా అక్రమమని, తమ వాయిస్‌ను నిలిపివేయాలని ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.
ఇక ఈ వివాదానికి కారణమైన కథనం “పైసామే ప్రమోషన్” అనే శీర్షికతో సాక్షి పత్రికలో ప్రచురితమైంది. ఈ కథనంలో పోలీసు శాఖలో పదోన్నతులు పొందడానికి డబ్బు లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఈ వ్యాసం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో, పోలీస్ అధికారుల సంఘం (Police Officers Association) నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది.
పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు (Srinivasarao) స్వయంగా ముందుకు వచ్చి సాక్షి ఎడిటోరియల్ సిబ్బందిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాసం ద్వారా రాష్ట్ర డీజీపీ (DGP) ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని, పోలీస్ వ్యవస్థను అవినీతిపరుడిగా చూపించారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన తాడేపల్లి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాక్షి ప్రధాన కార్యాలయంలో సోదాలు జరగడం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఇప్పటికే ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ, ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. పోలీసులు మాత్రం న్యాయపరమైన ప్రక్రియలో భాగంగానే చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. అయితే పాత్రికేయులు మాత్రం ఈ దర్యాప్తు వెనుక స్వేచ్ఛను అణచివేయాలనే ఉద్దేశమే ఉందని వాదిస్తున్నారు. మొత్తంగా, సాక్షి పత్రికలో ప్రచురితమైన ఒక కథనం పెద్ద వివాదానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి.. మరి ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయి అన్నది చూడాలి..







