Trishul: ‘త్రిశూల్’ కాన్సెప్ట్ తో పవన్ పవర్ఫుల్ ప్లాన్..

జనసేన (Janasena) పార్టీ కార్యకలాపాలు కొత్త దిశగా అడుగులు వేస్తున్నాయి. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా ‘త్రిశూల్’ (Trishul) అనే ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. విశాఖపట్నం (Visakhapatnam) లో ముగిసిన “సేనతో సేనాని” (Sena tho Senani) సమావేశం వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. పార్టీ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం ఒక తారకమంత్రంలా పనిచేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జనసేన కార్యకర్తల మధ్య ఈ త్రిశూల్ ప్రణాళిక ప్రధాన చర్చాంశంగా మారింది.
త్రిశూల్ ప్రణాళికలో మూడు కీలక అంచెలు ఉన్నాయి. మొదటిది కార్యకర్తల బలోపేతం. ఇప్పటివరకు పార్టీ ప్రభావం ఎక్కువగా నగరాలు, పట్టణాల్లోనే కనిపించింది. అయితే, ఇప్పుడు దానిని గ్రామీణ స్థాయికి విస్తరించే ఆలోచనతో జనసేన ముందుకెళ్తోంది. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగరాలని, ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధంగా, గ్రామాల్లో కూడా కార్యకర్తలను పెంచి, పార్టీ బలాన్ని పెంచాలనేది ప్రథమ దశలోని లక్ష్యం.
రెండవది నాయకత్వం. ఇప్పటివరకు పార్టీలో చేరిన సభ్యులు ఏం చేయాలి అన్న దానిపై కొంత అనిశ్చితి ఉండేది. దీనికి ముగింపు పలికేలా పవన్ కళ్యాణ్ కొత్త పద్ధతిని తీసుకువచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పార్టీ కార్యకర్తలలో నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, వారికి బాధ్యతలు అప్పగిస్తారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో పార్టీకి కొత్త నాయకులు తయారవుతారు, వారికి గుర్తింపు వస్తుంది. దీంతో జనసేనలో నాయకత్వ స్థాయి మరింత బలపడుతుంది.
ఇక మూడవది భద్రత , బాధ్యత. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా, పార్టీలో కీలక పాత్ర పోషించే నాయకులకు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా పార్టీ అండగా ఉంటుంది. అదే సమయంలో, వారికి అధిక బాధ్యతలు అప్పగించబడతాయి. రాబోయే పదేళ్లలో జనసేనను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో, మూడో దశకు చేరిన వారిని ఎమ్మెల్యే స్థాయి వరకు పెంచి, పెద్ద బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు. ఇలా చేసి, వారిని అధికార ప్రతినిధులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు.
త్రిశూల్ ప్రణాళిక ద్వారా పవన్ కళ్యాణ్ ఉద్దేశం స్పష్టమైంది. పార్టీని మూడు స్థాయిల్లో అభివృద్ధి చేసి, పెద్ద సంఖ్యలో కొత్త నాయకులను తీర్చిదిద్దడం, కార్యకర్తలతో నేరుగా బంధం పెంచుకోవడం, అలాగే పార్టీని రాబోయే సంవత్సరాల్లో మరింత శక్తివంతం చేయడం. ఈ విధానం ద్వారా జనసేన తన భవిష్యత్తు ప్రయాణాన్ని మరింత బలంగా ప్రారంభించిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.