Pawan Vs Jagan: వైసీపీపై దూకుడు పెంచబోతున్న పవన్ కల్యాణ్..!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి (NDA Govt) ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సుపరిపాలనకు ఏడాది’ పేరిట అమరావతిలో (Amaravati) జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. “తేడా చేస్తే తొక్కి నారతీస్తాం, జగన్ ఇక రాడు, రానివ్వం” అని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీపై పవన్ కల్యాణ్ మళ్లీ దూకుడుగా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలను ఇస్తున్నాయి. ఎన్నికల ముందు “జగన్ (YS Jagan) గుర్తు పెట్టుకో.. నిన్ను నీ పార్టీని అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు.. నా పార్టీ జనసేనే కాదు” అని సవాల్ చేశారు. ఇప్పుడు అదే రేంజ్ దూకుడుతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.
గత ఏడాది కాలంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వ విధానాలు, పాలనపై దృష్టి పెట్టారు. అదే సమయంలో సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ కాలంలో వైసీపీని నేరుగా టార్గెట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. అయితే, ఇప్పుడు వైసీపీపై రాజకీయ దాడిని తీవ్రతరం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. మెతక వైఖరితో ఉంటే కూటమి ప్రభుత్వాన్ని బలహీనపరిచే ఆలోచనలో వైసీపీ ఉందని, దీన్ని ఆదిలోనే అడ్డుకోవాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై వైసీపీపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
గత వైసీపీ పాలనలో రాష్ట్రం నియంతృత్వ శక్తుల చేతిలో నలిగిపోయిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. రాజకీయంగా బలపడేందుకు పవన్ కల్యాణ్ కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారని ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. జగన్ అవినీతి, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రెస్ మీట్‌లు, సభలు, ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కార్యాచరణ ద్వారా వైసీపీని రాజకీయంగా దెబ్బతీయాలని, అదే సమయంలో కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేయాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, అవినీతి, అరాచక పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని పవన్ గతంలోనూ విమర్శించారు. ఇప్పుడు ఈ అంశాలను మరింత లోతుగా తీసుకెళ్లి, జగన్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, వైసీపీ నేతల అక్రమ ఆస్తులు, పాలనలో అవినీతి ఆరోపణలపై దృష్టి సారించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై నమోదైన కేసులనే ఇందుకు ఊదాహరణలుగా చూపనున్నారు. అదే సమంయలో జనసేన క్యాడర్‌ను సమాయత్తం చేసి గ్రామ స్థాయిలో ప్రచారం చేపట్టే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించేందుకు కృషి చేసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో, మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, వైసీపీ రాజకీయంగా కుట్రలు పన్నుతోందని, దీన్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటామని హెచ్చరించారు. మొత్తంగా, పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించాయి. వైసీపీపై దాడి, ప్రభుత్వ విజయాల ప్రచారం కలిసిన వ్యూహంతో జనసేన, కూటమి రాజకీయంగా మరింత బలపడే అవకాశం ఉంది.