Pawan Kalyan: కూటమి మనుగడపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్ కల్యాణ్!
రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన (Janasena) మధ్య గ్యాప్ పెరిగిందనే ఊహాగానాలకు, విమర్శలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గట్టి సమాధానం ఇచ్చారు. చిత్తూరు వేదికగా గురువారం కూటమిలోని మూడు పార్టీల నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇది కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదు. కూటమి ఐక్యతకు, భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసిన ఒక సభగా ఇది నిలిచింది.
కొంతకాలంగా, పవన్ కల్యాణ్‌ను కీలక సమావేశాలకు పిలవట్లేదనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు, విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్, అమరావతి మాక్ అసెంబ్లీలకు ఆహ్వానించలేదనే వార్తలు ప్రముఖంగా వినిపించాయి. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌తో ఆయనకు చెడింది అనే ప్రచారమూ జోరుగా సాగింది. ఈ విమర్శల మధ్య, కూటమిలో చంద్రబాబు, లోకేశ్ హవా మాత్రమే నడుస్తోందని, పవన్‌ను పట్టించుకోవడం లేదనే అపవాదు కూడా వచ్చింది.
అయితే, ఈ విమర్శలన్నింటినీ చిత్తూరు సమావేశంతో పవన్ కల్యాణ్ తిప్పి కొట్టగలిగారు. డిప్యూటీ సీఎంగా ఆయన చొరవ తీసుకుని, కూటమి భాగస్వామ్య పక్షాల నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం, వారికి స్వయంగా దిశానిర్దేశం చేయడం –ఇదంతా కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు, ఇది కూటమి ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.
కూటమి పార్టీల నేతలతో పవన్ కల్యాణ్ ఇలాంటి సమగ్ర సమావేశాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం, ఆయన తాత్వికత, రాజకీయ పరిణతిని స్పష్టం చేసింది. కూటమి కేవలం ఐదేళ్లు కాకుండా, రాబోయే 15 ఏళ్లపాటు అధికారంలో ఉండాలనే సుదీర్ఘ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మాటలు, కూటమి భాగస్వామ్యం కేవలం తాత్కాలిక అవసరం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న చారిత్రక నిర్ణయమని తేల్చి చెప్పాయి. “అధికారంలోకి వచ్చింది గొడవలు పడడానికి కాదు,” అంటూ కూటమి నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. పాలనలో గానీ, పార్టీల మధ్య సంబంధాలలో గానీ ఎటువంటి ఆరాచకాలు, గందరగోళం లేకుండా ఉండాలని పవన్ ఉద్ఘాటించారు. “రాష్ట్రం బాగుండాలి, అరాచకాలు ఆగాలి” అనే ఒకే ఒక ఉద్దేశంతో మూడు పార్టీలు కలిసి పని చేశాయని గుర్తు చేశారు. కూటమిగా కలిసినప్పుడు చిన్న చిన్న గొడవలు సహజమేనని, అయితే కలిసి కూర్చుని మాట్లాడుకుంటే వాటికి పరిష్కారం లభిస్తుందని నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలు, కూటమిలో నెలకొన్న చిన్నపాటి విభేదాలకు అంతర్గత చర్చలతో ముగింపు పలకవచ్చనే సంకేతాన్ని ఇచ్చాయి.
చంద్రబాబు, లోకేశ్ నాయకత్వానికి అనుబంధంగా కాకుండా, కూటమిలో జనసేనాని తనదైన ప్రత్యేక పాత్రను పోషిస్తూ, అన్ని భాగస్వామ్య పక్షాల నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం, వారికి దిశానిర్దేశం చేయడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సమావేశం ద్వారా పవన్ కల్యాణ్… ఎవరెన్ని కుట్రలు చేసినా కూటమి మనుగడకు సమస్య లేదు అనే నిజాన్ని మరోసారి స్పష్టంగా నిరూపించారు. కూటమిలోని కీలక నాయకుల మధ్య ఎటువంటి గ్యాప్ లేదని, ఉన్నదంతా ఒకే ఉమ్మడి లక్ష్యం అని ఆయన చర్యలు చాటి చెప్పాయి. దీంతో కూటమి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో కూటమిలోని అన్ని పార్టీలు సమన్వయంతో, ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతాయనే విశ్వాసాన్ని ఈ చిత్తూరు సమావేశం పెంచింది. రాజకీయ విమర్శలు, ఊహాగానాలు ఒకవైపు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం మధ్య ఐక్యత బలంగా ఉందని పవన్ కల్యాణ్ నిరూపించారు.






