Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పిలుపు ..కొత్త రాజకీయ సమీకరణలకు వేదికగా ‘సేనతో సేనాని’..

జనసేన (Janasena) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఒక పెద్ద స్థాయి కార్యక్రమం నిర్వహించబోతోంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఈ పార్టీ, దాదాపు పదకొండు సంవత్సరాల ప్రయాణం తర్వాత సుమారు 14 నెలల పాలన పూర్తి చేసింది. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం “సేనతో సేనాని” (Sena tho Senani) పేరిట మూడు రోజులపాటు సమావేశాలు ఏర్పాటు చేసింది. గురువారం నుంచి శనివారం వరకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పూర్తిగా కార్యకర్తలతో గడపనున్నారు.
విశాఖపట్నం (Visakhapatnam) ఈ సమావేశాలకు వేదికగా నిలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేనకు ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంగణాన్ని ఎంచుకున్నారని అంటున్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ అభిమానులు గణనీయంగా ఉండటం, అలాగే ఆ ప్రాంతంలో జనసేనకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఈ సమావేశం విజయవంతం కావడం ఖాయం అని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. మొదటి రోజు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు గురించి చర్చ జరగనుంది. రెండవ రోజు నియోజకవర్గాల వారీగా ఎంపికైన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడతారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం పది మంది ప్రతినిధులను తీసుకురావాలని ఇప్పటికే సూచించారు.
ఈ సమావేశాల కోసం వైఎంసిఎ (YMCA) హాలు, మున్సిపల్ స్టేడియం వేదికలుగా ఎంచుకోగా, చివరి రోజు ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో (Indira Gandhi Priyadarshini Stadium)భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం పార్టీ భవిష్యత్తు దిశను నిర్ణయించే స్థాయిలో ఉండబోతోందని శ్రేణులు అంటున్నాయి.
ఇప్పటి వరకు అధికంగా ప్రభుత్వ పనుల్లో నిమగ్నమైన పవన్ , తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలతో నేరుగా మాట్లాడటం ప్రత్యేకతగా మారింది. గత సంవత్సరం నుండి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు నేరుగా చెప్పే అవకాశం లభించడం వల్ల ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ (TDP)తో పైస్థాయి సంబంధాలు బాగున్నప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే వేదికగా కూడా “సేనతో సేనాని” నిలుస్తుందా అన్నది అందరి ఆసక్తిని రేపుతోంది.
మరోవైపు, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పెట్టిన పేరు కూడా చర్చనీయాంశమైంది. టీడీపీ ప్రతి రెండేళ్లకోసారి “మహానాడు” పేరిట విస్తృత సమావేశాలు చేస్తూ వస్తోంది. వైసీపీ (YSRCP) కూడా అప్పుడప్పుడు “ప్లీనరీ” పేరుతో భారీ సదస్సులు నిర్వహిస్తుంది. కానీ జనసేన మాత్రం ఇప్పటి వరకు వార్షికోత్సవం తప్ప మరే పేరుతో పెద్ద సమావేశాలు చేయలేదు. తొలిసారి “సేనతో సేనాని” పేరిట మూడు రోజులపాటు నిర్వహించడం పార్టీ భవిష్యత్తులో మరింత సుస్థిరమైన సంప్రదాయంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.