Pawan: ఏపీ రాజకీయాలలో కొత్త అధ్యాయం రాసిన విప్లవం..పవన్..

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సాధారణంగా ఒక ఉద్యమం మొదలవ్వడానికి ముందు అనేక సంకేతాలు కనిపిస్తాయి. కానీ ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే విభిన్న మార్గంలో నడిచింది. సినీ రంగంలో సొంత గుర్తింపు సంపాదించిన పవన్, రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు చాలామంది ఇది ఎక్కువ రోజులు నిలవదనుకున్నారు. ”కొద్ది రోజులు ఉంటారు.. తర్వాత జెండా మడిచి పెట్టేస్తారు” అని విమర్శించిన వారే క్రమంగా ఆయనను తక్కువ అంచనా వేసినట్లు గ్రహించారు.
జనసేన పార్టీ ఏర్పాటయ్యాక మొదట్లో సహకారం అందని పరిస్థితులు ఎదురైనా, పవన్ కళ్యాణ్ తనకున్న ధైర్యం, పట్టుదలతో వాటిని అధిగమించారు. ఆయన తన సినిమా ఇమేజ్‌పైనే ఆధారపడకుండా, ప్రజలతో మమేకమవ్వడాన్ని ఎంచుకున్నారు. రైతులు, కూలీలు, వెనుకబడిన వర్గాల సమస్యల పట్ల చిత్తశుద్ధితో నిలబడ్డారు. ఈ వైఖరి ఆయనకు రాజకీయంగా నిలకడను ఇచ్చింది. తొలినాళ్లలో విమర్శలు ఎదురైనా కాలక్రమేణా సమాజం మొత్తం ఆయన వైపు తిరిగింది.
రాజకీయాల్లో ఎప్పుడు దూకుడుగా ఉండాలో, ఎప్పుడు తగ్గాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సూత్రం తెలిసినవారే దీర్ఘకాలం కొనసాగగలరు. పవన్ కూడా అదే దారిని ఎంచుకున్నారు. 2023లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrabbau) కు మద్దతు ఇవ్వడం ద్వారా తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం ఆయనకు ప్రజాదరణను మరింత దగ్గర చేసింది. అది ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా మారింది.
సినిమా రంగంలోనూ మొదటి రోజులలో అనేక కష్టాలు ఎదురైనా, తన కృషితోనే స్టార్ ఇమేజ్ సాధించారు. రాజకీయాల్లోనూ అదే విధంగా విప్లవాత్మక మార్పు తీసుకువచ్చారు. ఆయన లక్ష్యం పదవులను పొందడమే కాకుండా, వాటిని ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరించడం. అందుకే గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆయనను దగ్గరగా చూసుకుంటున్నాయి.
జనసేన పార్టీ (JanaSena Party) ఒక కుటుంబ పార్టీగా కాకుండా, ప్రజలదే అన్న భావన కలిగేలా తీర్చిదిద్దిన విధానం ఆయన నాయకత్వానికి నిదర్శనం. మొదట రెండు చోట్ల ఓడిపోయినా తర్వాతి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడంతో పాటు తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరిని గెలిపించి 100% స్ట్రైక్ రేట్ తో అందరిని ఆశ్చర్యపరిచారు. ఇది పవన్ కళ్యాణ్ విప్లవం ఎప్పటికీ తాత్కాలికం కాదని నిరూపించింది.
ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం మొత్తం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కానీ శుభాకాంక్షల కంటే గొప్పది ఆయన సాధించిన ప్రజాభిమానమే. పదవులు వస్తాయి పోతాయి, కానీ హృదయాలను గెలుచుకోవడమే అసలైన నాయకత్వం అని పవన్ మరోసారి చాటిచెప్పారు. అందుకే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఆయనను ఊహించని విప్లవం సృష్టించిన నేతగా గుర్తిస్తున్నారు.