Pawan Kalyan: రాజకీయాల నుంచి గ్రామీణ అభివృద్ధి వరకు విస్తృత ప్రభావం చూపుతున్న పవన్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నడుస్తున్న ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ఎన్నికల ముందు బలమైన కూటమిని ఏర్పాటు చేయడం.. చంద్రబాబు (Chandra Babu) జైల్లో ఉన్న సమయంలో టిడిపికి అండగా నిలవడంలో ఆయన తీసుకున్న చొరవ, అధికారంలోకి తీసుకురావడంలోనూ పోషించిన పాత్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కూడా ప్రభుత్వంలోని మూడు పార్టీలను ఒకదారిలో నడిపించే శక్తిగా పవన్ వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా యువతపై పవన్ కల్పించే ప్రభావం మరెవరూ కలిగించలేకపోతున్నారు. ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాల వైఖరి వంటి అంశాలపై ఆయన గళం వినిపించిన ప్రతీసారి, అది యువతను ప్రభావితం చేస్తోంది. ఇది కూటమికి ఒక స్పష్టమైన ప్రయోజనంగా మారిందని పరిగణిస్తున్నారు. ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress party) అధినేత జగన్ (Y.S. Jagan Mohan Reddy) లో యువతను ఆకర్షించే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లేకపోవడం, పవన్‌కి అదనంగా ఓ బలాన్ని ఇస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక సామాజికంగా చూస్తే, కాపు వర్గం నుంచి పవన్‌కి వస్తున్న మద్దతు గణనీయంగా ఉంది. గతంలో ఆ వర్గం ఆశలు కొన్ని ఇతర నాయకులపై ఉన్నా, ఇప్పుడు మాత్రం పవన్ ఒక్కరే తమను రాజకీయంగా ముందుకు నడిపించగల నాయకుడిగా భావిస్తున్నారు. దీనివల్ల జనసేనకి మాత్రమే కాకుండా, మొత్తం కూటమికే ఓ విశేషమైన సామాజిక మద్దతు లభిస్తున్నట్టు పరిశీలన జరుగుతోంది.
రాజకీయంగా కాకుండా అభివృద్ధి కార్యక్రమాల పరంగా కూడా పవన్ తనదైన ముద్ర వేశారన్న మాట వినిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో విద్య, రోడ్లు, మౌలిక సదుపాయాల వంటి అంశాలపై తీసుకున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. పల్లెప్రాంతాల్లో రహదారి అభివృద్ధి ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చిన పవన్, ఆవిధంగా పరిపాలనలో తన పాత్రను చాటారు. ఇది కూటమికి సాధ్యమైనంత బలాన్ని జత చేస్తున్నదిగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కేవలం సినీ హీరోగా మాత్రమే కాకుండా, సమర్థవంతమైన పాలనా భాగస్వామిగా కూడా ఎదుగుతున్నారు. తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందుతూ, కూటమి పాలనకు ఆయువుపట్టుగా నిలుస్తున్న ఆయన భవిష్యత్తు రాజకీయాల్లో కీలకంగా మారుతుందన్నది స్పష్టమవుతోంది.