New AP Bar Policy: మందుబాబుల కోసం ఏపీలో కొత్త బార్ పాలసీ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మందుబాబులు తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో కృషి అయిపోతున్నారు . ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు బార్లు మూసివేయాల్సి వచ్చేది. కానీ నూతన బార్ పాలసీ ప్రకారం ఇకపై రాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉండేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 8 గంటల నుంచే బార్లు ప్రారంభించుకునే వీలు ఉంటుంది. ఈ కొత్త విధానం మూడు సంవత్సరాలు కొనసాగనుంది. అంటే 2028 సెప్టెంబర్ వరకు అమల్లో ఉంటుంది. నేటి నుంచే ఈ పాలసీ అమలులోకి వస్తోంది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో బార్లు అర్ధరాత్రి దాటినా కూడా పనిచేస్తుంటాయి. ఉదాహరణకు ముంబై (Mumbai)లో రాత్రి 1 గంట 30 నిమిషాల వరకు బార్లకు అనుమతి ఉంది. హైదరాబాద్ (Hyderabad)లో కూడా రాత్రి 12 వరకు బార్లు తెరచి ఉంచేందుకు అనుమతి ఉంది. అయితే బెంగళూరు (Bengaluru)లో మాత్రం కాస్త భిన్నంగా ఉంది. అక్కడ శుక్రవారం, శనివారం రోజుల్లో రాత్రి 1 గంట వరకు అనుమతి ఉంది. మిగతా రోజుల్లో మాత్రం 11:30 వరకు మాత్రమే అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాత్రి 12 వరకు బార్లు తెరిచి ఉంచే అవకాశం ఇవ్వడం వినియోగదారులకు ఒక సౌలభ్యంగా మారింది.
అంతేకాకుండా కొత్త పాలసీలో మరికొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. బార్లలో చౌకగా 99 రూపాయల క్వార్టర్ సీసాలు విక్రయించరాదని స్పష్టం చేశారు. అలాగే గీత కార్మికుల కోసం 10 శాతం రిజర్వేషన్‌ను కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 840 బార్లలో 84 బార్లను గీత కార్మికులకు ప్రత్యేకంగా కేటాయించారు. దీని ద్వారా వారికి ఒక ఆర్థిక అవకాశాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా ఆగస్టు 30వ తేదీతో గడువు ముగిసింది. అయితే ఈసారి ఆశించినంతగా దరఖాస్తులు రాలేదు. అందువల్ల మరోసారి గడువు పెంచే అవకాశముందనే సమాచారం వినిపిస్తోంది. ప్రతి బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలని నిబంధన పెట్టారు. కానీ కొన్ని చోట్ల అంతకంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం లాటరీ విధానాన్ని అనుసరించాలా? లేదా మరోసారి గడువు ఇవ్వాలా? అనే అంశంపై ఆలోచిస్తోంది.
కొత్త బార్ పాలసీ అమల్లోకి రావడం వల్ల మద్యం ప్రియులకు ఒక గంట అదనపు సమయం దొరకడం ఖాయం. వ్యాపార పరంగా కూడా ఇది కొంత ఉత్సాహాన్ని తెస్తుందని అంచనా. మరోవైపు గీత కార్మికులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వడం సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తోంది. మొత్తానికి, ఈ కొత్త బార్ పాలసీ రాష్ట్రంలో మద్యం వినియోగదారులు, వ్యాపారులు, గీత కార్మికులపై ప్రభావం చూపనుంది.







