Nellore Mayor: నెల్లూరులో హైడ్రామాకు తెర.. అవిశ్వాసానికి ముందే మేయర్ స్రవంతి రాజీనామా!
నెల్లూరు నగర పాలక సంస్థ రాజకీయం గత కొన్ని రోజులుగా ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతూ, చివరకు అనూహ్యమైన క్లైమాక్స్‌కు చేరుకుంది. డిసెంబర్ 18న మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు టీడీపీ సర్వం సిద్ధం చేసిన వేళ, శనివారం రాత్రి చోటుచేసుకున్న పరిణామం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అవిశ్వాస గండం నుంచి గట్టెక్కే మార్గం లేకపోవడంతో, మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఆమె తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్ పీఠం అధికారికంగా టీడీపీ వశం కావడం ఇక లాంఛనమే.
నిజానికి నెల్లూరు కార్పొరేషన్ గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటగా ఉండేది. మొత్తం 54 కార్పొరేటర్ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలోనే ఒక కార్పొరేటర్ రాజీనామా చేయగా, మేయర్ మినహా మిగిలిన 52 మంది సభ్యుల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. అధికారం మారాక 42 మంది కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరడంతో వైసీపీ బలం గణనీయంగా పడిపోయింది. దీంతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పావులు కదిపింది. మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టుకుని డిసెంబర్ 18న అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారు చేసింది.
అవిశ్వాస తీర్మానం గడువు సమీపిస్తున్న కొద్దీ నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ ఏకపక్ష విజయం ఖాయమని అనుకుంటున్న తరుణంలో, నాలుగు రోజుల క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఐదుగురు కార్పొరేటర్లు తిరిగి వైసీపీ కండువా కప్పుకోవడం టీడీపీకి షాక్ ఇచ్చింది. ఈ పరిణామంతో అవిశ్వాస తీర్మానంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, టీడీపీ అధిష్టానం వెంటనే అప్రమత్తమైంది. వైసీపీ గూటికి చేరిన ఆ ఐదుగురిలో ఇద్దరిని బుజ్జగించి, తిరిగి తమ వైపునకు తిప్పుకోవడంలో టీడీపీ సఫలమైంది. ఈ రివర్స్ ఆపరేషన్ తో వైసీపీ శిబిరంలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్లు సమాచారం.
అవిశ్వాస తీర్మానం జరిగితే, సభలో బలం నిరూపించుకోవడం మేయర్ స్రవంతికి అసాధ్యమని తేలిపోయింది. కనీస మద్దతు లేకపోవడంతో సభలో అవమానకర రీతిలో ఓడిపోవడం కంటే, ముందుగానే రాజీనామా చేసి గౌరవప్రదంగా తప్పుకోవడమే మంచిదని ఆమె భావించినట్లు తెలుస్తోంది. అందుకే డిసెంబర్ 18 వరకు వేచి చూడకుండా, శనివారమే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే స్రవంతి తనంతట తాను రాజీనామా చేసిందా.. లేకుంటే హైకమాండ్ ఆదేశాలతో తల వంచిందా అనేది తెలీదు.
మేయర్ రాజీనామా లేఖకు కలెక్టర్ ఆమోదం లభిస్తే, ఇక అవిశ్వాస తీర్మానంతో పని ఉండదు. మేయర్ పీఠం ఖాళీ అయినట్లు ప్రకటిస్తారు. ఆ వెంటనే నిబంధనల ప్రకారం కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ప్రస్తుతం టీడీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, నెల్లూరు నగర ప్రథమ పౌరుడి పీఠం టీడీపీ ఖాతాలో చేరడం ఖాయం. ఒకప్పుడు వైసీపీకి పెట్టని కోటలా ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌పై టీడీపీ జెండా ఎగరడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. మొత్తానికి ఎత్తులు, పైఎత్తుల నడుమ సాగిన ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజయం టీడీపీనే వరించింది.






