YCP: జగన్ పై అసంతృప్తితో వైసిపి సీనియర్ నేతలు.. అసలు కారణం అదే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఆవిర్భావం నుంచి అనేక రాజకీయ కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వెంట నిలిచాయి. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy)తో ఉన్న అనుబంధం, సామాజిక వర్గాల ప్రభావం కారణంగా చాలా మంది సీనియర్ నేతలు పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. మేకపాటి, ఆళ్ల, కేతిరెడ్డి వంటి కుటుంబాలు పార్టీ ప్రారంభ దశలో కీలకంగా వ్యవహరించాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఇచ్చే ప్రాధాన్యం తగ్గిందన్న భావన బలపడుతోంది.
జగన్ నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) వంటి కొద్దిమంది నేతలకే అధిక ప్రాధాన్యం లభించిందన్న విమర్శలు ఉన్నాయి. నిర్ణయాల దగ్గర నుంచి వనరుల పంపిణీ వరకు వీరి మాటకే విలువ ఉంటోందని సీనియర్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల పార్టీ ఆది నుంచి తోడుగా ఉన్న కుటుంబాలు క్రమంగా దూరమవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
శ్రీకాకుళం (Srikakulam) నుంచి అనంతపురం (Anantapuram) వరకు కాంగ్రెస్ కాలంలో ప్రభావం చూపిన రాజకీయ కుటుంబాలు చాలావరకు వైయస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నాయి. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు లభించిన గౌరవం, ప్రాధాన్యం ఇప్పుడు లేదన్న బాధ వారిలో ఉంది. తమ అభిప్రాయాలు చెప్పినా పట్టించుకోవడం లేదని, నిర్ణయాలు ఒక వర్గం చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయం లేక చాలామంది పార్టీలోనే ఉంటూ మౌనంగా ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ అసంతృప్తికి ఉదాహరణగా ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) పేరు తరచూ వినిపిస్తోంది. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల మళ్లీ చురుగ్గా కనిపించడం గమనార్హం.
నెల్లూరు (Nellore) జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి (Mekapati Raja Mohan Reddy) వైయస్‌కు సమకాలీనుడు. అందుకే జగన్మోహన్ రెడ్డికి పెద్దన్న పాత్రలో అండగా ఉండాలని భావించి కుటుంబంతో కలిసి పార్టీలో చేరారు. ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి (Chandrasekhar Reddy), కుమారులు గౌతమ్ రెడ్డి (Goutham Reddy), విక్రమ్ రెడ్డి (Vikram Reddy) అందరూ పార్టీ కోసం పనిచేశారు. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబ ప్రాధాన్యం తగ్గిందన్న భావన పెరిగింది. రాజమోహన్ రెడ్డి సూచనలకు విలువ లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది.
అదే విధంగా ఆళ్ల కుటుంబం కూడా అసంతృప్తిలో ఉందని సమాచారం. పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి (Alla Ayodhya Rami Reddy) జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) కూడా పార్టీ కోసం కష్టపడ్డారు. అయినా మంగళగిరి (Mangalagiri) టికెట్ దక్కకపోవడం, సరైన గుర్తింపు లేకపోవడం ఆ కుటుంబాన్ని నిరాశకు గురిచేసింది. అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ (Rajya Sabha) పదవీకాలం త్వరలో ముగియనుండటంతో, భవిష్యత్తుపై వారు ఆలోచిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు వైయస్సార్ కాంగ్రెస్‌లో సీనియర్ నేతల అసంతృప్తిని బయటపెడుతున్నాయి.






