నారా లోకేశ్ కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా.. శ్రీవారికి 38 లక్షల విరాళం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు దేవాంశ్ పుట్టిన రోజు సందర్భంగా భార్య బ్రహ్మణి, తల్లి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం 7:10 గంటలకు ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న వారికి అధికారి లోకనాథం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం లోకేశ్ దంపతులు శ్రీతరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకొని దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు వితరణకు రూ.38 లక్షలు అందించారు. భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించి వారితోపాటే స్వీకరించారు.






