Pawan Kalyan: పవన్ మూవీపై లోకేష్ వైరల్ ట్వీట్.. మిశ్రమ స్పందన..
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న నారా లోకేష్ (Nara Lokesh)కి, జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య సుస్థిరమైన మైత్రి కొనసాగుతోంది. రాజకీయంగా ఎంతటి ఒత్తిడులు ఎదురైనప్పటికీ, వీరి మధ్య ఉన్న పరస్పర గౌరవం మాత్రం మారలేదు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, వీరి స్నేహం కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా, వ్యక్తిగత స్థాయిలోనూ కనిపించడమే.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో పవన్ టీడీపీ (TDP) కి భారీ మద్దతుగా నిలిచారు.2024 ఎన్నికల సమయంలో వైసిపి (YCP ) పై ఘన ఎరుగని విజయాన్ని సాధించడంలో ఈ ఇద్దరి మధ్య ఉన్న మేధో సమన్వయం ప్రధాన పాత్ర పోషించింది. పార్టీలు వేరు అయినా, లక్ష్యం ఒక్కటే అన్న దృష్టితో కలిసి పనిచేయడం వల్లే ప్రజలు కూడా విశ్వాసంతో ఓటేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా, అదే ఐక్యతతో ముందుకు సాగుతున్నారు.
ఇటీవల పవన్ నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్కు ముందు రోజు నారా లోకేష్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంది. “మా పవన్ అన్న” అంటూ ప్రారంభించిన ఆ పోస్ట్ పవన్ అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది. సినిమాలో పనిచేసిన బృందానికి అభినందనలు తెలుపుతూ, పవన్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆయన నటనతో సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.
ఈ ట్వీట్ మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని స్పష్టంగా చూపించింది. సాధారణంగా సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మద్దతుదారులు తరచూ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తిట్టుకుంటూ ఉంటారు. కానీ నేతలైతే అలా ప్రవర్తించకుండా, ఆలోచనతో, శ్రద్ధతో పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
అయితే లోకేష్ ట్వీట్ పై సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలు వెళ్లడవుతున్నాయి. కొందరు రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధాన్ని మెచ్చుకుంటుంటే మరికొందరు సినిమాని రాజకీయంతో ముడిపెట్టడం కరెక్టేనా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మూవీ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఒక్క సినిమాకి ఎంత హడావిడి అవసరమా అన్న విమర్శ కూడా వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత స్థాయిలోనూ ఇలాంటి సానుకూల పరిణామాలు రాజకీయాలకు మరింత ఆరోగ్యకర వాతావరణం తీసుకురాగలవు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







