TDP : టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా : లోకేశ్

టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. పాల్వాయిగేట్ ఈవీఎం (EVM) ధ్వంసం ఘటనలో టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు (Namburi Seshagiri Rao) గట్టిగా పోరాడి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని గుర్తు చేశారు. నంబూరి శేషగిరిరావు ఇటీవల గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Ramakrishna Reddy) ఈవీఎంను ధ్వంసం చేస్తుంటే నంబూరి శేషగిరిరావు ఎదురు తిరిగి పోరాడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన మృతిచెందిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి నారా లోకేశ్ పిలిపించుకుని మాట్లాడారు. కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబ బాధ్యతలను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు.