Nara Lokesh: శెభాష్ లోకేశ్..! పెట్టుబడుల కోసం వినూత్న ప్రయత్నాలు..!!

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక పెట్టుబడులకు (Industries) స్వర్గధామంగా మార్చాలనే లక్ష్యంతో పని చేస్తోంది చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తనదైన శైలిలో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో X వేదికపై ఆయన చేసిన పోస్టులు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలను హైలైట్ చేస్తూ, పారిశ్రామిక రంగాలను ఆకర్షించడం ఒక వినూత్న ప్రయత్నంగా చెప్పవచ్చు.
ఇటీవల కర్నాటక ప్రభుత్వం (Karnataka Govt) బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకాలో ఏరోస్పేస్ పార్క్ (Aerospace park) కోసం 1,777 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను రైతుల ఆందోళనల వల్ల విరమించుకుంది. ఈ సందర్భాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న నారా లోకేశ్, ఎక్స్ వేదికపై ఒక పోస్ట్ ద్వారా ఏరోస్పేస్ పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలని ఆహ్వానించారు. “డియర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, కర్నాటక నిర్ణయంపై విచారం వ్యక్తం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఆకర్షణీయమైన ఏరోస్పేస్ విధానం, ఉత్తమ ప్రోత్సాహకాలతో పాటు బెంగళూరు సమీపంలో 8,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. మాట్లాడేందుకు రండి!” అని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ లోని “జస్ట్ అవుట్‌సైడ్ బెంగళూరు” అనే పదం కర్నాటకకు ఇబ్బందికరంగా మారింది. అనంతపురం జిల్లాలోని లేపాక్షి-మడకసిరా ప్రాంతంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ (aero space industry) నెలకొల్పాలని ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పోస్ట్ పై కర్నాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. “కర్నాటక భూమిని మాత్రమే కాకుండా భారతదేశంలోనే నంబర్ వన్ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌ను అందిస్తుంది” అని గట్టిగా సమాధానమిచ్చారు. అయితే, ఆసక్తికరంగా, కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోకేశ్‌ను ప్రశంసిస్తూ, “ఇలాంటి విధానాలతోనే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు సృష్టించబడతాయి. కర్నాటక ప్రభుత్వం లోకేశ్ నుంచి నేర్చుకోవాలి” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు, అయితే ఆ పోస్ట్‌ను తర్వాత తొలగించారు.
లోకేశ్ సోషల్ మీడియా వ్యూహం ఏరోస్పేస్ రంగంతోనే ఆగలేదు. తాజాగా, మహీంద్రా గ్రూప్ (Mahindra Group) ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తెలుగులో ఒక వాణిజ్య ప్రకటనను ఎక్స్ లో పోస్ట్ చేశారు. దానికి లోకేశ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం మహీంద్రా గ్రూప్‌ను ఆహ్వానించారు. “మీ తెలుగు యాడ్ చూసి సంతోషించాను. ఆంధ్రప్రదేశ్‌లో మీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాము” అని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి ఆనంద్ మహీంద్రా సానుకూలంగా స్పందిస్తూ, “ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్రా గ్రూప్ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. వివిధ రంగాల్లో పెట్టుబడులపై చర్చలు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. ఈ సంభాషణ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సూచిస్తూ, నెటిజన్ల ప్రశంసలు అందుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏరోస్పేస్ రంగంలో రూ.50,000 కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రెండు ప్రత్యేక విధానాలను రూపొందించింది. విశాఖపట్నం-శ్రీకాకుళం ప్రాంతంలో నావల్ సిస్టమ్స్, జగ్గయ్యపేట-దొనకొండలో మిస్సైల్ ఉత్పత్తి, కర్నూలు-ఓర్వకల్‌లో డ్రోన్ టెక్నాలజీస్, లేపాక్షి-మడకసిరాలో ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ కోసం ప్రత్యేక కారిడార్‌లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయి. అదనంగా, తిరుపతిలో 2,600 ఎకరాల స్పేస్ సిటీ, డీఆర్‌డీఓ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ తో పరిశోధన, అభివృద్ధికి కేంద్రంగా మారనుంది.
నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికల ద్వారా చేస్తున్న ఈ వినూత్న ప్రచారం నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఆయన అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.