Nara Lokesh: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మంత్రులు లోకేష్, అనిత భేటీ
న్యూఢిల్లీ: గతనెల 28,29 తేదీల్లో మొంథా తుపాను కారణంగా ఉధృతంగా వీచిన గాలులు, భారీ వర్షపాతం, వరదలు అనేక గ్రామాలు, వ్యవసాయ భూములను తీవ్రంగా ప్రభావితం చేశాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), హోంమంత్రి అనిత తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మంత్రి లోకేష్… హోం మంత్రి అనితతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మొంథా తుపాను నష్టాన్ని వివరిస్తూ… ఈ తుఫాను మొత్తం 24 జిల్లాల్లోని 443 మండలాల పరిధిలో 3,109 గ్రామాలను ప్రభావితం చేసింది. సుమారు 9.53 లక్షల మంది ప్రజలు నష్టాన్ని చవిచూశారు. పంట మునిగిపోవడం, నదుల ఉద్ధృతి, సముద్ర అలల ప్రభావం వల్ల వ్యవసాయ జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, పౌర సేవా రంగాలకు భారీనష్టం సంభవించింది.
వ్యవసాయ రంగంపై ప్రభావం
తీరప్రాంతం, డెల్టా ప్రాంతాల్లో నిరంతర వర్షపాతం, ఎక్కువ కాలం పంట నీట మునగటం కారణంగా వ్యవసాయ పంటలకు భారీగా నష్టం సంభవించింది. సుమారు 1.61 లక్షల హెక్టార్ల పంటలు (వరి, మక్కజొన్న, పత్తి, వేరుశనగ, కంది పప్పు, సిరిధాన్యాలు మొదలైనవి) దెబ్బతిన్నాయి. 3.27 లక్షల మంది రైతులు ప్రభావితమయ్యారు. ఉత్పత్తి నష్టాలు సుమారు 4.36లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది.పంటలతో పాటు చెరువులు, కాలువలు, పుంత రోడ్లు దెబ్బ తినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పండ్ల తోటలు, ఉద్యాన పంటలపై ప్రభావం
సుమారు 6,250 హెక్టార్లలో (33% కంటే అధికం) – అరటి, బొప్పాయి, కొబ్బరి, పసుపు, మిరప, కూరగాయలు, పూలు, ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తు వల్ల తోటల మద్దతు నిర్మాణాలు ధ్వంసమై రైతులక జీవనోపాధి సవాళ్లను సృష్టించింది. తోటలకు అనుబంధ మౌలిక సదుపాయాలు – నర్సరీలు, షేడ్నెట్లు, వ్యవసాయ చెరువులు, నిల్వ గదులు, చిన్న నీటి వనరులు కూడా తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయి. రాష్ట్ర ప్రభుత్వం సమయోచితంగా చర్యలు తీసుకుని, ప్రజల తరలింపు, సహాయ శిబిరాల నిర్వహణ, SDRF/NDRF బృందాల మోహరింపు, వివిధ శాఖల ద్వారా నష్టాల అంచనా వంటి చర్యలను వేగంగా అమలు చేసింది. ఈ చర్యలు మానవ నష్టాలను తగ్గించడంతోపాటు బాధితులకు నిరంతర సహాయాన్ని అందించడంలో ఇబ్బందులు లేకుండా చేశాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.






