Municipal Elections: ఏపీ రాజకీయాలలో ఆసక్తి రేపుతున్న మునిసిపల్ ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో త్వరలో మరోసారి రాజకీయ వేడి పెరగనుంది. 2024 ఎన్నికల్లో అధికార మార్పు జరిగిన తరువాత, ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్షగా మారబోతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతపై పదేపదే మాట్లాడుతున్న వైసీపీ (YCP) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి ఈ ఎన్నికలు తన బలం నిరూపించుకోవడానికి కీలకంగా కనిపిస్తున్నాయి. మరోవైపు, అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) తమకు లభిస్తున్న ప్రజా ఆదరణను నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ (Neelam Sawhney) ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఎన్నికల కోసం అవసరమైన సన్నాహాలు చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 17 నాటికి మున్సిపల్ స్థానిక సంస్థల పదవీకాలం ముగుస్తుండటంతో, అప్పటికి ముందే ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆ పదవీకాలం త్వరలో ముగియనుంది.
అలాగే రెండో విడతలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ (Nellore Municipal Corporation)తో పాటు 12 మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలకు నవంబర్ 2021లో ఎన్నికలు జరిగాయి. వీటి గడువు వచ్చే ఏడాది నవంబర్ 21తో ముగుస్తుంది. కాకినాడ (Kakinada) మున్సిపల్ కార్పొరేషన్‌కు 2017లో జరిగిన ఎన్నికల గడువు 2022లోనే ముగిసింది. ఇక శ్రీకాకుళం (Srikakulam), రాజమహేంద్రవరం (Rajamahendravaram), మంగళగిరి-తాడేపల్లి (Mangalagiri-Tadepalli) మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో 19 పట్టణ సంస్థలకు న్యాయపరమైన సమస్యల కారణంగా గతంలో ఎన్నికలు జరగలేదని కమిషన్ తెలిపింది.
మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు పదవీకాలం ముగిసిన మూడు నెలల్లోపు జరగాలి. అందుకే అక్టోబర్ 15లోగా డీలిమిటేషన్, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని నీలం సాహ్నీ సూచించారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 మధ్య ఓటర్ల జాబితా సిద్దం చేయాలని, నవంబర్ 1 నుంచి రిటర్నింగ్ అధికారులను నియమించాలని ఆదేశించారు. నవంబర్ 16 నుంచి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి, నవంబర్ 30లోగా కసరత్తు పూర్తి చేయాలని, డిసెంబర్ 15లోగా రిజర్వేషన్ల ప్రక్రియ ముగించుకోవాలని చెప్పారు.
డిసెంబర్ చివర్లో రాజకీయ పార్టీలు, సీనియర్ అధికారులతో ప్రత్యేక సమావేశాలు జరిపి జనవరి 2026లోపు మున్సిపల్ ఎన్నికలు జరపాలని ప్లాన్ చేశారు. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను 2026 జనవరిలో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జూలైలో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికలు కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య పెద్ద పోరాటానికి దారితీయనున్నాయి. ఫలితాలు ఏపీలో రాజకీయ సమీకరణాలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.