Amaravati : అమరావతికి చట్టబద్ధత.. రాజధాని గుర్తింపు దిశగా ముందడుగు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ, పరిపాలనా చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దశాబ్దకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించుతూ, రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి (Amaravati) చట్టపరమైన రక్షణ (Statutory Backing) కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజన చట్టం-2014కు సవరణ చేయడం ద్వారా అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ప్రక్రియ మొదలైంది.
కేవలం రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా కాకుండా, పార్లమెంటు చట్టం ద్వారా రాజధానిని నిర్ణయించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 రూపొందించారు. ఇందులో పార్ట్-2 కింద ఉన్న సెక్షన్ 5(1), 5(2) రాజధాని అంశాన్ని ప్రస్తావించాయి.
సెక్షన్ 5(2) ప్రకారం, హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న తర్వాత, తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది అని మాత్రమే ఉంది. అక్కడ నిర్దిష్టంగా ఏ ప్రాంతం పేరునూ పేర్కొనలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సెక్షన్ 5(2)ను సవరించి “ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది” అనే వాక్యం స్థానంలో “అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటైంది” అని స్పష్టంగా లిఖితపూర్వకంగా చేర్చనుంది. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, రాజకీయ కారణాలతో రాజధానిని మార్చడం అసాధ్యమవుతుంది. అమరావతికి ఒక లీగల్ లాక్ పడుతుంది. దీనికి కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే ఆమోదం తెలపింది.
అమరావతి ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగలేదు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. 29 గ్రామాల రైతులు చరిత్రలో నిలిచిపోయేలా 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్‌తో పనులు మొదలయ్యాయి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు నిర్మితమయ్యాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి తలకిందులైంది. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ‘మూడు రాజధానుల’ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో అమరావతి అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. రైతులు రోడ్డెక్కి ఉద్యమించాల్సి వచ్చింది. పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. 2024లో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో అమరావతికి పూర్వవైభవం వచ్చింది. రూ. 58 వేల కోట్లతో పనులు పునఃప్రారంభమయ్యాయి.
అయితే, భవిష్యత్తులో మళ్ళీ రాజధాని మార్పు నిర్ణయాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది. విభజన చట్టంలోని సెక్షన్ 5(2) సవరణ ముసాయిదాకు కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ముసాయిదాను ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదం తర్వాత, దీనిని పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తారు. పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్రపతి సంతకంతో ‘అమరావతి ఏపీ రాజధాని’ అని ప్రకటిస్తూ అధికారిక గెజిట్ విడుదలవుతుంది.
ఈ చట్టబద్ధత వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అనేక ప్రయోజనాలు చేకూరతాయి. రాజధానిపై స్థిరత్వం లేకపోవడం వల్ల గత ఐదేళ్లుగా రాష్ట్రం పెట్టుబడులను కోల్పోయింది. ఇప్పుడు చట్టబద్ధత రావడంతో అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థలు నిధులు ఇవ్వడానికి ముందుకొస్తాయి. భూములిచ్చిన వేలాది మంది రైతులకు ఇది ఒక భరోసా. తమ త్యాగానికి చట్టపరమైన రక్షణ లభించిందన్న సంతృప్తి వారికి కలుగుతుంది. ప్రపంచ పటంలో అమరావతి ఒక సుస్థిరమైన నగరంగా గుర్తింపు పొందుతుంది.
అమరావతికి చట్టబద్ధత కల్పించడం అనేది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర భవిష్యత్తు స్థిరత్వానికి సంబంధించిన అంశం. కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యతో అమరావతి చుట్టూ అలుముకున్న రాజకీయ మేఘాలు తొలగిపోయి, అది దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఎదిగేందుకు మార్గం సుగమం కానుంది.






