Kolikapudi: ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలకు రంగం సిద్ధం..!?

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) టీడీపీకి తలనొప్పిగా మారారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి, పార్టీ కార్యకర్తలతో విభేదాలు, స్థానిక నాయకులతో సమన్వయ లోపం, ప్రభుత్వంపై విమర్శలు, మీడియాపై అనుచిత వ్యాఖ్యలు వంటి అంశాలు ఆయనను వివాదాల కేంద్రబిందువుగా నిలిపాయి. తాజాగా వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో (Peddireddy Ramachandra Reddy) గన్నవరం విమానాశ్రయంలో ఆయన సమావేశం కావడం టీడీపీ కేడర్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనతో పార్టీ హైకమాండ్ ఆయనపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంతో టీడీపీ అధిష్ఠానం ఆయనకు తిరువూరు (Tiruvuru) రిజర్వు నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన పనితీరు, వ్యవహార శైలి పార్టీకి ఇబ్బందిగా మారింది. స్థానిక నాయకులతో సమన్వయం లేకపోవడం, కార్యకర్తలను అవమానించడం, మీడియాపై దురుసు వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలు ఆయనపై వచ్చాయి. చిట్యాల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు, ఆయన భార్య కవితపై వేధింపుల ఆరోపణలు చేసిన ఘటన ఆయనను మరింత వివాదంలోకి నెట్టింది. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ కోరుతూ కొలికపూడి సెప్టెంబర్ 30, 2024న దీక్ష చేపట్టారు. కానీ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య సూచనతో దీక్షను విరమించారు.
తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడి వైఖరి స్థానిక నాయకులు, కార్యకర్తలలో అసంతృప్తిని పెంచింది. ఆయనపై ఇసుక, మట్టి తవ్వకాల్లో అక్రమాలు, బెల్ట్ షాపుల నిర్వహణ, కుల పెత్తనం వంటి ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఒక టీడీపీ కార్యకర్త డేవిడ్, కొలికపూడి వేధింపులు తాండవించలేక పురుగుల మందు తాగిన ఘటన కూడా ఆయనపై ఆగ్రహాన్ని మరింత పెంచింది. అదే విధంగా, నీటిపారుదల శాఖ ఏఈ వి. కిషోర్ సూసైడ్ నోట్‌లో కొలికపూడిని బాధ్యుడిగా పేర్కొనడం సంచలనం రేపింది.
కొలికపూడి వ్యవహార శైలిపై టీడీపీ హైకమాండ్ (TDP) పలుమార్లు హెచ్చరించింది. అక్టోబర్ 5, 2024న మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, సీనియర్ నేతలు వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణ రాజు ఆయనతో చర్చించి, వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఆయన తన తప్పులను ఒప్పుకుని, ఇకపై సమన్వయంతో పనిచేస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఆయన తీరులో మార్పు కనిపించలేదు.
తాజాగా గన్నవరం విమానాశ్రయంలో కొలికపూడి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సమావేశం కావడం టీడీపీ కేడర్‌లో కలకలం రేపింది. ఈ భేటీ పార్టీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేసింది. కొలికపూడి గతంలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమావేశం ఆ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఈ ఘటనతో టీడీపీ హైకమాండ్ ఓపిక హద్దు దాటినట్లు భావిస్తోంది.
టీడీపీ హైకమాండ్ ఇప్పటివరకు కొలికపూడిని సముదాయించే ప్రయత్నం చేసింది. అయితే, పెద్దిరెడ్డితో సమావేశం తర్వాత పార్టీ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆయనను సస్పెండ్ చేసే అవకాశం ఉందని, లేదా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గా మరొకరిని నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇటీవల నందిగామ పర్యటనలో సీఎం చంద్రబాబు, కొలికపూడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం కూడా హైకమాండ్ వైఖరిని సూచిస్తోంది. టీడీపీ హైకమాండ్ తీసుకునే తదుపరి చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర మలుపులకు దారితీయవచ్చు.