ఐసీఐసీఐ బ్యాంకు స్కామ్‌లో కీలక పరిణామం

విజయవాడ ఐసీఐసీఐ బ్యాంకు స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు మేనేజర్ నరేశ్ బృందం పెట్టుబడి పెట్టిన సంస్థకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. నెక్సస్ సంస్థతో నరేశ్ లావాదేవీలు జరిపినట్లు సీఐడీ గుర్తించింది. ఖాతాదారుల నుంచి కాజేసిన డబ్బంతా నరేశ్ బృందం నెక్సస్ గ్రోత్‌లో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. దీంతో నరేశ్‌తో లావాదేవీలు నిర్వహించినవారిని సీఐడీ అధికారులు విచారించే అవకాశముంది. ఇప్పటికే మూడు బృందాలుగా ఏర్పడిన సీఐడీ అధికారులు విజయవాడ, నరసరావుపేట, చిలకలూరిపేట శాఖల్లో తనిఖీలు నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట బ్రాంచిలో నరేశ్ చేసిన మోసాలను జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా గుర్తించారు. అతను పనిచేసిన కాలంలో వివిధ శాఖల్లో కలిపి మొత్తం 72 మంది ఖాతాదారుల నుంచి రూ.28 కోట్లు కాజేసినట్లు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి కేసు గుంటూరు సీఐడీ కార్యాలయానికి బదిలీ చేశారు.