Jagan: 2029 ఎన్నికలకి పక్కా ప్రణాళిక తో రెడీ అవుతున్న జగన్..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గత ఇరవై నెలలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా కనిపించకుండా, పార్టీని ముందుకు నడిపించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రతీ ఆందోళన, ప్రతీ కార్యక్రమం పార్టీ నాయకులే చేపట్టేలా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా చేపట్టిన ఉద్యమం గణనీయమైన స్పందన తెచ్చుకుంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
2024 ఎన్నికల ఓటమి తరువాత జగన్ తీసుకుంటున్న ప్రధాన నిర్ణయం ఒక్కటే. పార్టీ బలంగా ఉంటేనే భవిష్యత్తు భద్రమన్న నమ్మకం. అందుకే ఆయన మొత్తం దృష్టిని పార్టీ కమిటీల ఏర్పాటు మీదే కేంద్రీకరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయా నియోజకవర్గాల ఇంచార్జీలకు సూచిస్తున్నారు. ఈ కమిటీల్లో మహిళా, యువజన, విద్యార్థి, రైతు, కార్మిక విభాగాల ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలన్నది ఆయన ఆలోచన.
ప్రతి బూత్ కమిటీలో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, కోశాధికారి ఉండేలా నిర్మాణం రూపొందిస్తున్నారు. ఈ విధానంతో ఒక్కో బూత్‌లోనే సుమారు యాభై మందికి పైగా కార్యకర్తలకు పదవులు దక్కుతాయని పార్టీ అంచనా. అక్కడి నుంచి వార్డు, పంచాయతీ, మండల స్థాయి మీదుగా నియోజకవర్గ స్థాయి వరకు ఇదే విధానం కొనసాగుతుంది. దీని ద్వారా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 15 వేల మందితో ‘జగనన్న సైన్యం’ తయారవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
సాధారణంగా ఒక్కో నియోజకవర్గంలో లక్షన్నర నుంచి రెండు లక్షల ఓటర్లు ఉంటారు. అందులో పదవ వంతు కార్యకర్తలుగా మారితే, ప్రతీ పది మంది ఓటర్లకు ఒక కమిటీ సభ్యుడు అన్న లెక్క వస్తుంది. ఈ కమిటీ సభ్యులు తమ చుట్టూ కనీసం అయిదుగురిని పార్టీ వైపు నిలబెట్టగలిగితే, ఒక్కో నియోజకవర్గంలో భారీగా ఓట్ల బలం ఏర్పడుతుందన్నది పార్టీ వ్యూహం. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఏర్పడే అసంతృప్తి, భవిష్యత్తులో చేపట్టే పాదయాత్రలు వంటి కార్యక్రమాలు ఈ బలాన్ని మరింత పెంచుతాయని అంచనా.
ఇటీవల విజయనగరంలో (Vizianagaram) జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి (Kolatagalla Veerabhadraswamy) మాట్లాడుతూ జగన్ దృష్టిని ప్రతి కార్యకర్త అర్థం చేసుకోవాలని చెప్పారు. కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీకి తిరుగు ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భీమిలీలో (Bhimili) జరిగిన సమావేశంలో పార్టీ ఇంచార్జి మజ్జి శ్రీనివాసరావు (Majji Srinivasa Rao) మాట్లాడుతూ కమిటీల పనితీరు పూర్తైన తర్వాత క్యాడర్‌కు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని తెలిపారు. ఐడెంటిటీ కార్డులు, ఇన్సూరెన్స్ వంటి భద్రతా చర్యలు కూడా అమలు చేస్తామని చెప్పారు. మొత్తంగా చూస్తే, వైసీపీ అధినాయకత్వం క్యాడర్‌ను కేంద్రంగా పెట్టుకుని భవిష్యత్ రాజకీయాలకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలే నాయకులుగా మారతారన్న సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.






