Chandrababu: జగన్ దూకుడు vs చంద్రబాబు స్థిరత్వం.. ప్రజల నమ్మకం ఎటువైపు?

వైసీపీ (YCP) గత ఎన్నికల్లో ఊహించని ఓటమి ఎదురైన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవుతానన్న నమ్మకాన్ని వెల్లడిస్తూ మీడియా ముందు కనిపించారు. నిన్న మధ్యాహ్నం జరిగిన తన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లకే పరిమితమవుతుందని, ఆ తర్వాత తానే తిరిగి సీఎంగా బాధ్యతలు చేపడతానని చెప్పారు.
జగన్ ప్రకటనలలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీపై (TDP) విరుచుకుపడడం కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తాను అధికారంలోకి తిరిగి వచ్చాక వారి చర్యలకు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంకా ఒక అడుగు ముందుకెళ్లి, “నా నాయకులు నా మాట కూడా వినకపోవచ్చు. అప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుంది. చంద్రబాబు తగిన జాగ్రతలు తీసుకోవాలి” అనే వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఓటమికి కారణంగా ప్రజలకు దూరంగా ఉండడం, కఠినమైన పరిపాలన తీరుతో పాటు జగన్ ప్రవర్తనలే ప్రధానమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జగన్ మాత్రం తన మాటల్లో ఎలాంటి మార్పు లేకుండా హెచ్చరికలు, ధీమా కలిగిన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇది చూస్తుంటే పార్టీ గతాన్ని చూసుకొని గుణపాఠం నేర్చుకోలేదని అర్థమవుతోంది.
ఇక మరోవైపు చంద్రబాబు, ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకునే దిశగా సాగుతున్నారు. నెలకోసారి జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం, ప్రజలతో మాట్లాడడం వంటి చర్యల ద్వారా ఆయన గ్రౌండ్ లెవెల్‌కి మరింత దగ్గరవుతున్నారు. విజయవాడ (Vijayawada), విశాఖపట్నం (Visakhapatnam) వంటి ముఖ్య ప్రాంతాల్లో ఆయన నిశ్శబ్దంగా, వ్యవస్థీకృతంగా తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉండి వారానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వచ్చి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్న తీరు ప్రజలకు అంతగా ఆకర్షణగా కనిపించడం లేదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, జగన్ హోదాలో ఉన్న నేతగా తన దూకుడు ధోరణిని కొనసాగిస్తుండడం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు పెంచుతోంది. ఇందుకే ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మద్దతు చంద్రబాబు వైపు ఎక్కువగా మొగ్గుతుందని భావిస్తున్నారు. ఒకరు మాటలతో హవా చూపిస్తుంటే, మరొకరు పనిచేసే తీరుతో ప్రజల మదిలో నిలుస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరి టైప్ రాజకీయం ప్రజలకు నచ్చుతుందో చూడాలి.