Jagan: చంద్రబాబు పై వైసీపీ కౌంటర్ ప్లాన్.. రికాలింగ్ చంద్రబాబు సాధ్యమేనా..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పిలుపుతో టీడీపీ (TDP) నేతలు జులై నెల నుంచి ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దీనికి ప్రత్యుత్తరంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) “రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో” (Re-Calling Chandrababu Manifesto) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. బుధవారం జరిగిన పార్టీ కీలక సమావేశంలో జగన్ స్వయంగా దీనికి ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
ప్రజల మద్దతు తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని వైసీపీ భావిస్తోంది. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదన్న విమర్శలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నా, పార్టీలోని లోపాల కారణంగా ఇది పూర్తిగా సాధ్యపడదన్న మాటలు వినిపిస్తున్నాయి.
వాస్తవంగా చూస్తే, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో జరిగిన మార్పులే ప్రస్తుతం అడ్డంకిగా మారాయి. దాదాపు 80 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు జరిగిన తర్వాత ఓటమి చెందిన పలువురు అభ్యర్థులు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. గెలిస్తే ఎమ్మెల్యేగా ఉండాలన్న ఆశతో రంగంలోకి దిగిన వారు ఓడిన తర్వాత పార్టీ పట్ల ఆసక్తి కోల్పోయారని అంటున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్‌చార్జ్‌లే లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది.
ఇంకొన్ని ప్రాంతాల్లో స్థానికేతర నాయకులు నియోజకవర్గ బాధ్యతలు చేపట్టడం వల్ల స్థానిక కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. ఈ పరిస్థితుల్లో “రికాలింగ్ చంద్రబాబు” కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో సమర్థంగా నిర్వహించగలమా అన్నది అనుమానంగా మారింది. అయినా వైసీపీ నాయకత్వం ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చాటిచెప్పేందుకే ముందుగా బహిరంగంగా ప్రచారంలోకి దిగాలనే వ్యూహంతో వైసీపీ ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో టీడీపీ ఇంటింటి కార్యక్రమం, వైసీపీ మేనిఫెస్టో రీకాలింగ్ యాత్రలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించనున్నాయి. ప్రజల స్పందన ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.