TDP: మరో టీడీపీ సీనియర్ కు గవర్నర్ పదవి ఖాయమా..?

రెండు తెలుగు రాష్ట్రాలలో గవర్నర్ పదవుల సందడి కొనసాగుతోంది. దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డి వంటివాళ్లు ప్రస్తుతం గవర్నర్లుగా ఉన్నారు. ఇక లేటెస్ట్ గా ఈ జాబితాలోకి టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) కూడా ఎంటర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి అప్పగించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా సమాచారం లేకుండానే ఈ విషయంలో సైలెంట్ గా ముందుకు అడుగు వేసింది కేంద్రం.
ఇక ఇప్పుడు మరో టిడిపి నాయకుడు గవర్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. చంద్రబాబు(Chandrababu Naidu)తో పాటు రాజకీయాల్లోకి వచ్చిన మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టవచ్చు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండే కెఈ కృష్ణమూర్తి 2019, 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయనకు తమిళనాడు రాజకీయాలపై కూడా స్పష్టమైన అవగాహన ఉంది.
దీనితో ఆ రాష్ట్ర గవర్నర్ గా ఆయనను నియమించే అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు పరిశీలకులు. తమిళం అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న కేఈ కృష్ణమూర్తికి, తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు అప్పగిస్తే త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమకు కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి అనే భావనలో బిజెపి పెద్దలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఓవైపు టిడిపిలో యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య లాంటి సీనియర్ నాయకులు గవర్నర్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అనూహ్యంగా అశోక్ గజపతిరాజు గవర్నర్ కావడం, ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి పేరు ప్రచారంలోకి రావడంతో మరి వాళ్ళు ఇద్దరి పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. అటు తెలంగాణకు చెందిన ఓ సీనియర్ నాయకుడు పేరు కూడా గవర్నర్ పదవికి వినపడుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.