Kapu+Dalit: కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం.. సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే (AP Politics) కుల సమీకరణాల (Caste Equations) చదరంగం. ఇక్కడ అధికారం ఎవరికి దక్కాలనేది నిర్ణయించేది అభివృద్ధి మంత్రం కంటే సామాజిక వర్గాల తంత్రమే ఎక్కువ. సరిగ్గా ఈ తరుణంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. “కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం తధ్యం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంకెల పరంగా చూస్తే అద్భుతంగా అనిపించవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో రాజకీయ వాస్తవాలను పరిశీలిస్తే మాత్రం అది అంత సులభమైన విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ జనాభాలో దళితులు, కాపు సామాజిక వర్గాలు సింహభాగం ఆక్రమించి ఉన్నాయి. కాపులు దాదాపు 17 శాతం, దళితులు సుమారు 18 శాతం ఉన్నారు. ఓట్ల పరంగా చూస్తే ఈ రెండు వర్గాలు కలిస్తే ఏ పార్టీనైనా గద్దె నెక్కించగలవు, లేదా దించగలవు. పీవీ సునీల్ కుమార్ ఉద్దేశం కూడా ఇదే. అగ్రవర్ణాల ఆధిపత్యానికి చెక్ పెట్టి, బహుజన రాజ్యాధికారం సాధించాలంటే ఈ రెండు వర్గాల కలయిక అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సిద్ధాంతపరంగా ఇది గొప్ప ఆలోచనే అయినా, ఆచరణలో మాత్రం ఈ రెండు వర్గాల మధ్య సఖ్యత కంటే, రాజకీయ వైరుధ్యాలే ఎక్కువగా ఉన్నాయి.
ఒకప్పుడు దళిత ఓటు బ్యాంకు అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇందిరా గాంధీ హయాం నుంచి దళితులు ఆ పార్టీకి అండగా నిలిచారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పతనం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిర్భావంతో ఆ ఓటు బ్యాంకు ముూకుమ్మడిగా వైసీపీ వైపు మళ్లింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో దళిత ఓట్లదే కీలక పాత్ర. అయితే, దళితులు ఒకేతాటిపై ఉన్నారా అంటే లేదనే చెప్పాలి. మాదిగలు, మాలల మధ్య ఉప కులాల వారీగా రాజకీయ ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దళితులు తమ సంప్రదాయ పార్టీలను కాదని, కొత్తగా పుట్టుకొచ్చే కూటమి వైపు మొగ్గుతారనే గ్యారెంటీ లేదు.
మరోవైపు కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తోంది. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపుల్లో ఒక హోప్ కనిపించింది. కానీ, ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ జనసేన రూపంలో మరోసారి ప్రయత్నించారు. అయితే, 2019 ఎన్నికల ఫలితాలు కాపుల ఓటింగ్ సరళిలోని వైవిధ్యాన్ని బయటపెట్టాయి. స్వయంగా పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడం, కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో వైసీపీ హవా నడవడంతో కాపులు ఏ ఒక్క పార్టీకో కట్టుబడి ఉండరని తేలిపోయింది. కానీ 2024 నాటికి సీన్ మారింది. ఈసారి కాపులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ పిలుపుతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి జైకొట్టారు. అంటే, కాపులు రాజ్యాధికారం కంటే, తమకు రాజకీయంగా లబ్ధి చేకూర్చే లేదా తమ ప్రత్యర్థులను ఓడించే వైపే మొగ్గుతున్నారు తప్ప, స్వతంత్ర శక్తిగా ఎదగలేకపోతున్నారు.
కాపులు, దళితులు కలవాలన్న పీవీ సునీల్ కుమార్ సూచన బాగానే ఉన్నా, ఈ రెండు భిన్న ధృవాలను కలిపే నాయకుడు ఎవరు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దళితులు నమ్మే నాయకుడిని కాపులు అంగీకరిస్తారా? కాపు సామాజిక వర్గ నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి దళితులు సిద్ధంగా ఉన్నారా? అంటే చెప్పలేం. గతంలో వంగవీటి రంగా హత్యోదంతం తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చోటుచేసుకున్న పరిణామాలు కాపు-దళిత వర్గాల మధ్య కొంత అగాధాన్ని సృష్టించాయి. ఆ మచ్చలు ఇంకా పూర్తిగా మాసిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు వర్గాలను ఒకే వేదికపైకి తేవడం కత్తిమీద సాము లాంటిదే.
ప్రస్తుతం ఏపీలో పార్టీలన్నీ కులాల పునాదుల మీదే ఉన్నాయి. వైసీపీకి దళితులు, రెడ్లు అండగా ఉంటే.. కూటమికి కమ్మ, కాపు, బీసీ వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇలా పార్టీల వారీగా నిలువునా చీలిపోయిన సమాజంలో.. కేవలం రాజ్యాధికారం అనే నినాదంతో కాపులు, దళితులు ఏకతాటిపైకి రావడం సమీప భవిష్యత్తులో అసాధ్యంగా కనిపిస్తోంది. పీవీ సునీల్ కుమార్ చెప్పిన ఫార్ములా పేపర్ మీద గెలవొచ్చు.. కానీ బ్యాలెట్ బాక్సులో గెలవాలంటే మాత్రం నమ్మకమైన నాయకత్వం, స్పష్టమైన కార్యచరణ అవసరం. అది లేనంత వరకు ఈ బహుజన రాజ్యాధికారం ఒక అందమైన కలగానే మిగిలిపోతుంది.






