Pawan Kalyan: రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి జనసేన ప్రయాణం సాధ్యమేనా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తన రాజకీయ ప్రస్థానంలో జాతీయ స్థాయిపై కూడా దృష్టి పెట్టడం గమనించదగ్గ విషయం. ఆయన ఎక్కువగా దేశానికి సంబంధించిన సమస్యలపై స్పందించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి చర్చను ముందుకు తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకవైపు పాజిటివ్ ఇమేజ్ ను ఇవ్వగా, మరోవైపు కొంతమంది విమర్శకుల ఆగ్రహాన్ని కూడా తెప్పించాయి. ఆయన అభిమానుల్లో కూడా చాలాసార్లు “అవసరమా ఇలాంటి సున్నితమైన విషయాలపై మాట్లాడటం?” అన్న అభిప్రాయాలు వినిపించాయి.
మహారాష్ట్ర (Maharashtra) ఎన్నికల్లో పవన్ బీజేపీ (BJP) తరుపున చేసిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన తమిళనాడు (Tamil Nadu) లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ కోసం ప్రచారం చేయనున్నారని సమాచారం. దీనిని బట్టి ఆయన జాతీయ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారని అనిపిస్తుంది. కొంతమంది విశ్లేషకులు అయితే ఆయన త్వరలోనే కేంద్ర కేబినెట్ లోకి వచ్చే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానించారు.
అయితే వాస్తవానికి జనసేన పార్టీ (Janasena Party) ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయి బలాన్ని సాదించలేకపోయింది. టిడిపి (TDP), వైసిపి (YSRCP) లాంటి పార్టీలకు ఉన్న గ్రామీణ స్థాయి నిర్మాణం జనసేనకు ఇప్పటివరకు ఏర్పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఆలోచించడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎన్డీయే (NDA) లో భాగమైనందువల్ల బీజేపీకి మద్దతుగా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేశారంతే అని చెబుతున్నారు.
ఇక ఇటీవల విశాఖపట్నం (Visakhapatnam) లో జరిగిన పార్టీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మూడు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలు చివరికి భారీ బహిరంగ సభతో ముగిశాయి. రాబోయే రోజుల్లో పార్టీని ఎలా బలంగా తీర్చిదిద్దాలో ఆయన వివరించారు. ముఖ్యంగా సభ్యత్వం ఉన్న కీలకమైన కార్యకర్తలకు నేరుగా పార్టీ నేతలతో సమన్వయం కలిగే విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు.
అంతేకాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తనతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కొందరు పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నారని, కానీ నిజమైన పోరాట శక్తి చూపినప్పుడే జనసేన గుర్తింపును జాతీయ స్థాయిలో పొందగలదని ఆయన అన్నారు. పార్టీ విస్తరణ కోసం సమయం పడుతుందని, అంత త్వరగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టడం సాధ్యం కాదని ఆయన మాటల్లో స్పష్టమైంది.
సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయం పంచుకుంటున్నారు. జనసేన పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే కనీసం మరో దశాబ్దం సమయం పట్టొచ్చని వారి అంచనా. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాటలు వింటే, ఆయనలో జాతీయ స్థాయిలో పార్టీని ఎదిగించాలనే సంకల్పం తప్పనిసరిగా ఉందని అర్థమవుతోంది. కానీ ముందు రాష్ట్రస్థాయిలో పార్టీని పూర్తిగా అభివృద్ధి చేసి అనంతరం జాతీయస్థాయి గురించి ఆలోచిస్తే బాగుంటుంది అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.