YS Jagan: సింగయ్య మృతి కేసులో జగన్‌కు హైకోర్టులో ఊరట..!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో (Rentapalla) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) పర్యటన సందర్భంగా జరిగిన ఒక విషాదకర ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో సింగయ్య (Singaiah) అనే వృద్ధుడు జగన్ వాహనం కింద పడి మరణించారు. ఈ కేసులో జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో (AP High Court) క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ జరిగిన విచారణలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
గతనెల 18న జగన్ రెంటపాళ్లలో నాగమల్లేశ్వర రావు అనే వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ జనసమూహం మధ్య సింగయ్య అనే వృద్ధుడు జగన్ వాహనం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కాసేపటికే ఆయన మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, గుంటూరు పోలీసులు సింగయ్య భార్య చీలి లూర్ధు మేరీ ఫిర్యాదు ఆధారంగా జగన్‌తో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు నాన్-బెయిలబుల్ నేరాల కిందకు వస్తాయి.
అయితే ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ జగన్‌తో పాటు ఇతర నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. జూన్ 27న తొలిసారి ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఆ సమయంలోనే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. “కారు ప్రమాదం జరిగితే, డ్రైవర్‌కు బాధ్యత ఉంటుంది కానీ కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు ఎలా నమోదు చేస్తారు?” అని ప్రశ్నించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కుంభమేళా వంటి భారీ సమావేశాల్లో ప్రమాదాలు జరుగుతాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇవాళ ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చింది. రాజకీయ కక్షతో నమోదు చేశారని, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా తప్పుడు సెక్షన్లు జోడించారని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. జగన్ పర్యటనలకు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని, రోప్ పార్టీలు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ తరపు న్యాయవాది (ఏజీ) విచారణలో సేకరించిన అదనపు మెటీరియల్ సమర్పించడానికి సమయం కావాలని కోరగా, కోర్టు రెండు వారాల సమయం మంజూరు చేసింది. అప్పటివరకు యధాతథ స్థితి కొనసాగించాలని, నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
జగన్ పర్యటనకు 14 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, 50 వాహనాలతో కాన్వాయ్ వచ్చిందని, ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా వీడియో ఫుటేజ్ నిజమైనదని ధృవీకరించబడిందని వాదించారు. అయితే విచారణాధికారి తాజాగా సేకరించిన అంశాలను సమర్పించాలని హైకోర్టు కోరింది. ఇందుకు సమయం కావాలని ఏజీ కోరడంతో విచారణను 2 వారాలపాటు వాయిదా వేసింది. అప్పటివరకూ ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించడంతో జగన్ సహా వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.