Gaza Deal: గాజా సంక్షోభానికి తెర.. ట్రంప్ డీల్‌కు హమాస్ అంగీకారం

గాజా సంక్షోభం పరిష్కారానికి (Gaza Deal) కీలక ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన గాజా శాంతి ఒప్పందానికి హమాస్ అంగీకరించింది. తమ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలందరినీ, మరణించిన వారి శరీరాలతో సహా విడుదల చేయడానికి తాము సిద్ధమని హమాస్ (Hamas) ప్రకటించింది. ఈ అంశంపై మధ్యవర్తుల ద్వారా తక్షణమే చర్చలు ప్రారంభించడానికి కూడా రెడీగా ఉన్నామని తెలిపింది. గాజా పాలనా బాధ్యతలను స్వతంత్ర మేధావుల బృందానికి అప్పగించడానికి కూడా అంగీకరిస్తున్నట్లు హమాస్ వెల్లడించింది. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు, అరబ్, ఇస్లామిక్ దేశాలు, అంతర్జాతీయ భాగస్వాములకు హమాస్ (Hamas) కృతజ్ఞతలు తెలిపింది.
ఫలించిన ట్రంప్ హెచ్చరిక
హమాస్ (Hamas) అంగీకారం తెలపడానికి కొద్ది సమయం ముందు, ఆ సంస్థకు అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) గట్టి హెచ్చరిక జారీ చేశారు. భారత కాలమానం సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల కల్లా (వాషింగ్టన్ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలు) బందీలను (Israel Hostages) విడుదల చేయాలని, లేదంటే హమాస్ (Hamas) నాయకులను తుదముట్టిస్తానని హెచ్చరించారు. హమాస్ అంగీకరించినా, అంగీకరించకపోయినా ఏం చేసయినా సరే మధ్యప్రాచ్యంలో (Middle East) శాంతిని స్థాపిస్తానని ఆయన (Donald Trump) స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ బందీలను (Israel Hostages) విడుదల చేస్తే మిగిలిన హమాస్ ఫైటర్లను ప్రాణాలతో వదిలిపెడతానని ట్రంప్ (Donald Trump) తెలిపారు. అన్ని దేశాలూ ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయని, ఇది హమాస్‌కు చివరి అవకాశం అని ఉద్ఘాటించారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయకపోతే హమాస్ (Hamas) ‘ఇప్పటి వరకు చూడని నరకం‘ చూపిస్తామని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, శాంతి చర్చలు ఏ విధంగా ముందుకు సాగుతాయో వేచి చూడాలి.