Pawan Kalyan: యువతకు పెద్దపీట వేస్తూ పవన్ కళ్యాణ్ ప్రకటించిన త్రిశూల్ ప్రణాళిక..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి తన సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగిన “సేనతో సేనాని” సభ చివరి రోజు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, దసరా పండుగ తర్వాత జనసేన తరఫున ‘త్రిశూల్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు పార్టీ లో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజకీయాలు పదవుల కోసం గాని, డబ్బు కోసం గాని కాకుండా ప్రజల కోసం చేయాలని, అలాంటి భావన ఉన్నవారే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవడానికి అంకితభావం అవసరమని చెప్పారు. ప్రతి జనసేన కార్యకర్త ఒక సైనికుడని, వారికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా కొత్త రకమైన సభ్యత్వ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు.
తన ప్రసంగంలో ఆయన గత అనుభవాలను గుర్తుచేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు వస్తున్నా, ఏపీలో (Andhra Pradesh) పార్టీని నిలబెట్టడం తన మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు. తమిళనాడు (Tamil Nadu)లో ఇటీవల బీజేపీ (BJP) నేతలు ఆహ్వానించినప్పటికీ, ఏపీలో జనసేన స్థిరపడటానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టిందని, అందుకే ఇక్కడే కృషి చేస్తున్నానని చెప్పారు.
కేంద్రంతో ఉన్న తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ఆ సంబంధాలు రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. నల్లమల (Nallamala) అడవుల్లో తవ్వకాల కోసం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో చెంచు గిరిజనులు తన వద్దకు వచ్చి సహాయం కోరగా, వారి జీవనాధారమైన అడవులను కాపాడటంలో తన వంతు పాత్ర పోషించానని పేర్కొన్నారు. ఇది తనకు నిజమైన తృప్తి కలిగించిందని తెలిపారు. వైసీపీ (YCP)పై పరోక్షంగా విమర్శలు చేస్తూ, రాజకీయాలు కేవలం ప్రకటనలు చేసే వేదిక కాదని, పనులతోనే ప్రజల విశ్వాసం పొందాలని చెప్పారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వారికి తగిన గుర్తింపు తప్పక లభిస్తుందని, పదవులు కోసం అర్ధం లేని ప్రయత్నాలు చేయడం వృథా అని అన్నారు.
జనసేన పార్టీని ఒక కులం కోసం కాకుండా దేశం కోసం నిర్మించామని ఆయన గట్టిగా చెప్పారు. కుల ఆధారిత రాజకీయాలు చేస్తే పార్టీ దాని పరిమితుల్లోనే ఉండిపోతుందని, కానీ జనసేన ప్రతి వర్గం ప్రజల కోసం ఉందని ఆయన స్పష్టం చేశారు. గుర్రం జాషువా (Gurram Jashuva) రచనలను ఉదహరిస్తూ తాను “విశ్వనరుడు”నని వ్యాఖ్యానించారు.పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఉన్న స్పష్టత, తన అనుభవాలపై చెప్పిన ఉదాహరణలు, భవిష్యత్తు వ్యూహాలపై ఇచ్చిన హామీలు కార్యకర్తలకు ఉత్సాహాన్ని కలిగించాయి. దసరా తర్వాత మొదలయ్యే ‘త్రిశూల్’ కార్యక్రమం ద్వారా పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందనే నమ్మకాన్ని ఆయన కలిగించారు.