Daikin: ఏపీలో భారీ పెట్టుబడులు.. రూ.1,000 కోట్లతో

జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేషన్ పరికరాల తయారీ కంపెనీ డైకిన్ (Daikin) ఇండస్ట్రీస్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో కంప్రెసర్ల తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసిటీ (Sri city)లో ఏర్పాటు చేయనుంది. తైవాన్ (Taiwan) కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో ఈ పెట్టుబడులు పెట్టనుంది. డైకిన్ ఇండియా, రెచి ప్రెసిషన్ కలిసి, ఇన్వర్టర్, నాక్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారు చేసి, ఇక్కడి నుంచి కొన్ని దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రాజెక్టులో మెజారిటీ వాటాదారుగా డైకిన్ ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పెట్టుబడుల ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తుంది. శ్రీసిటీలో నెలకొల్పబోయే యూనిట్‌తో కలిపి దేశంలో మూడు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసినట్లవుతుంది. 75 ఎకరాల్లో ఏర్పాటు చేసే కర్మాగారం ఆగ్నేయాసియాలోనే అతి పెద్దది అవుతుంది. దేశంలో ప్రస్తుతం 2 మిలియన్ యూనిట్లను తయారు చేస్తున్నాం. 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్ యూనిట్లకు చేర్చాలన్నది లక్ష్యం. దేశీయ మార్కెట్‌లో ఏసీ విక్రయాల్లో మెజారిటీ వాటా దక్కించుకోవాలన్నదే మా ఆలోచన. ఈ ఒప్పందం వల్ల దేశీయంగా మధ్య తరగతి ప్రజలకు చౌక ధరకే ఏసీలను అందించడం సాధ్యం అవుతుంది అని సంస్థ ప్రకటనలో తెలిపింది.