ఏపీలో 2018కి చేరిన పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 7,409 శాంపిల్స్‌ను పరీక్షించగా 38 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2018కి చేరింది. అలాగే, రాష్ట్రంలో మరో 73 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహమ్మారి సోకి ఇప్పటివరకు 998 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 975 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు, కర్నూలులో అత్యధికంగా చెరో తొమ్మిది చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో నమోదైన తొమ్మిది కేసుల్లో ఎనిమిది తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవే కావడం గమనార్హం. అలాగే, అనంతపురంలో ఎనిమిది, గుంటూరు 5, కృష్ణా 3, విశాఖ 3, నెల్లూరులో 1 చొప్పున కేసులు నమోదైనట్టు బులిటెన్‌లో పేర్కొంది.






