Pawan Kalyan: కఠిన నిబంధనలతో కాంట్రాక్టర్లు వెనుకడుగు.. ప్రశ్నార్ధకంగా పంచాయతీల అభివృద్ధి..
15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) నుంచి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ నిధులు వచ్చాయి. దాదాపు 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు చేరాయి. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం గ్రాంట్‌ను కలిపితే మొత్తం సొమ్ము 2000 కోట్ల వరకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ డబ్బును పూర్తిగా పంచాయతీల అభివృద్ధి పనులకే వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా వెయ్యి కోట్లకు పైగా నిధులు వచ్చినప్పుడు వాటితో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ నిధులతో మరింత విస్తృతంగా ప్రాజెక్టులు చేయడానికి అవకాశం ఉంది.
అయితే, ఈ సారి ఆ ఊపు మాత్రం కనిపించడం లేదు. పంచాయతీల్లో పనులు చేపట్టేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రావడంలేదని సమాచారం. ఇప్పటికే ప్రారంభించిన పనులను పూర్తిచేసి ఇకపై తాము కొనసాగించలేమని చిన్న కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో నిధులు వచ్చినా సంతోషం కనిపించకపోవడం, పనులు లభించాయన్న ఉత్సాహం లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.
దీనికి ముఖ్య కారణం నిధుల వినియోగంలో కఠినమైన నిబంధనలు. కేంద్రం చెప్పిన విధానాల ప్రకారమే ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కాంట్రాక్టర్లకు ఇబ్బందిగా మారింది. సాధారణంగా ప్రభుత్వ పనులు పొందడానికి అధికారులు నుంచి నాయకుల వరకూ కొంత ముడుపులు తప్పవని మాట వినిపిస్తుంది. గ్రామీణ స్థాయిలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుందని అంటారు. అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పంచాయతీ రాజ్ శాఖ (Panchayathi Raj) బాధ్యతలు చేపట్టడంతో అవినీతి ఒత్తిడి తగ్గింది. అయినప్పటికీ ప్రతి రూపాయి లెక్కలు వేసి, ఖచ్చితమైన విధానం ప్రకారం మాత్రమే డబ్బు విడుదల కావడంతో తాము పనిచేసినా కనీస లాభం రావడంలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
దీన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని వారి వాదన. కానీ అధికారులు మాత్రం తమ చేతుల్లో ఏమీ లేదని, కేంద్రం సూచనల మేరకే ఖర్చు చేయాలని నిబంధన ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక మరోవైపు ఈ నిధులను ఆరు నెలలలోపు ఖర్చు చేయాలని గడువు విధించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సొంత గ్రాంట్ 200 కోట్లను కూడా అదే సమయానికి సమకూర్చాల్సి ఉంటుంది. లేకపోతే ఈ భారీ నిధులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి కోసం వచ్చిన డబ్బు సద్వినియోగం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. కానీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, నిబంధనల కఠినత సమస్యగా మారడంతో అభివృద్ధి పనులు నిలిచిపోవచ్చనే ఆందోళన నెలకొంది. పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొని పరిష్కారం చూపుతారో చూడాలి.







