Cognizant: విశాఖకు కాగ్నిజెంట్-ముహుర్తం ఫిక్స్
విశాఖపట్నం (Visakhapatnam) లో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్(Cognizant) కార్యకలాపాల ప్రారంభానికి తేదీ ఖరారైంది. ఈ నెల 12న విశాఖ ఐటీ పార్కు హిల్ నంబరు 2పై తాత్కాలిక సెంటర్ ప్రారంభించనుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేరోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి కూడా సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ నిర్మాణాలు 2028 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎకరా రూ.30 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకే ఇస్తున్నందున కాగ్నిజెంట్‌కు ఏపీఐఐసీ (APIIC) అధికారులు ముందుగానే కొన్ని నిబంధనలు పెట్టారు. నిర్ణీత గడువులో నిర్మాణం పూర్తి చేసి, ఉద్యోగాలు ఇచ్చిన తరువాత పూర్తిస్థాయిలో భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని పేర్కొన్నారు. ఈలోగా పనులు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు ఇస్తామని ఏపీఐఐసీ వర్గాలు తెలిపాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పించే ఐటీ సంస్థలకు తక్కువ ధరకే ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. అందులో భాగంగానే కాగ్నిజెంట్‌కు కాపులుప్పాడలో 22.1 ఎకరాలు కేటాయించింది. మొత్తం రూ. 1,582.98 కోట్లు పెట్టుబడి పెట్టే ఆ సంస్థ 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒప్పందం చేసింది.






