కరోనా పరీక్షల్లో ఏపీ అగ్రస్థానం : వైఎస్ జగన్
కరోనా నిర్థారణ పరీక్షల్లో ఆంధప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,65,069 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి 10 లక్షల జనాభాకు 3,091 పరీక్షలు జరుపుతున్నట్లు వివరించారు. కరోనా నిరోధక కార్యచరణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. తమిళనాడు కోయంబేడు మార్కెట్ వల్లే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెంది కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలాంటి అనుమతులు, పరీక్షలూ లేకుండా 700 మంది కూలీలు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సరిహద్దులో 11 చోట్ల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.






