Chandrababu: మహిళల సంక్షేమంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మహిళల కోసం మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు కీలక పథకాలపై సమీక్ష నిర్వహించి, వాటిలో ఉన్న లోటుపాట్లను తక్షణమే సరిచేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లి వందనం పథకం (Thalliki Vandanam Scheme) విషయంలో మిగిలిపోయిన లబ్ధిదారులకు తక్షణమే డబ్బులు అందాలని స్పష్టంగా చెప్పారు. జిల్లా వారీగా ఇప్పటికీ 200 నుండి 300 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు నివేదించగా, అర్హులైన ప్రతి తల్లికి పిల్లలు ఎంతమంది ఉన్నా, మూడు రోజులలోపే వారి ఖాతాలలో నిధులు జమ చేయాలని ఆయన ఆదేశించారు.
ఇకపుడు మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మరింత విస్తరించేలా మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉచిత ప్రయాణం పరిమిత బస్సులకే వర్తించగా, ఇకపై ఎక్కడైనా మహిళలు ఎక్కే ప్రతి బస్సులోనూ ఉచిత ప్రయాణం కల్పించాలని ఆదేశించారు. బస్సులో ఎన్ని మంది మహిళలు ఉన్నా ఎలాంటి పరిమితి ఉండదని ఆయన స్పష్టంచేశారు. అంతేకాకుండా, ఇప్పటివరకు బస్టాండ్ (Bus Stand) నుండి టికెట్ తీసుకుని నిర్దిష్ట స్టేజ్ (Stage) వరకు వెళ్లే బస్సుల్లో ఉచితం వర్తించేది కాదు. ఇప్పుడు ఆ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని సీఎం తెలిపారు.
మరొక ముఖ్యమైన నిర్ణయం ప్రకారం, ఎక్కడైనా నాలుగురికిపైగా మహిళలు ఉన్నపుడు వారు చేతి సంకేతం ఇస్తే ఆ బస్సు ఆగి వారిని ఎక్కించుకోవాలని ఆర్టీసీ (APSRTC) అధికారులకు ఆదేశించారు. ఆ ప్రాంతంలో బస్‌స్టాప్ (Bus Stop) లేకపోయినా ఇది తప్పనిసరిగా అమలవ్వాలన్నారు. అయితే ఈ నియమం నాలుగురికిపైగా మహిళలు ఉన్నపుడు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు వెళ్లే బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండాలని తెలిపారు. మొత్తం 36 ఘాట్ రోడ్ల (Ghat Roads) మీదుగా ఆలయాలకు వెళ్లే బస్సులు ఉన్నాయని, వాటన్నింటిలో మహిళలు ఎలాంటి టికెట్ లేకుండా వెళ్లగలగాలని ఆదేశించారు.
ఇక ప్రయాణ సమయంలో అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల శ్రీకాకుళం (Srikakulam) లో ఓ మహిళ, ఓ పురుషుడు సీటు కోసం గొడవపడి చెప్పులతో కొట్టుకున్న ఘటనను ఉదాహరణగా చూపిస్తూ, ఇలాంటి విషయాలను తీవ్రంగా తీసుకోవాలని తెలిపారు. ఆ ఘటనలో ఉన్న ఇద్దరిపై పోలీసు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇకపై బస్సుల్లో మహిళలకు ఇబ్బంది కలిగించేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. మొత్తం మీద, సీఎం చంద్రబాబు మహిళలకు ప్రయాణం మరింత సులభం కావడమే కాకుండా, భద్రతను కూడా పెంచే విధంగా చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మహిళలకు ఉపయుక్తమయ్యే అవకాశం ఉంది.