Chandrababu: ఇది రాష్ట్ర సచివాలయమా? కమర్షియల్ కాంప్లెక్సా? : చంద్రబాబు
వెలగపూడి సచివాలయంలో ఎక్కడికక్కడ బారికేడ్లు (Barricades) ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అసహనం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర సచివాలయమా (Secretariat)? కమర్షియల్ కాంప్లెక్సా అని ఆయన ప్రశ్నించారు. సచివాలయానికి ముఖ్యమంత్రి వచ్చే సమయంలో రహదారిపైకి వాహనాలు, ప్రజలు ప్రవేశించకుండా పోలీసులు (Police) బారికేడ్లను ఏర్పాటు చేశారు. సచివాలయ ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రకటనలతో కూడిన బారికేడ్లను అడ్డు పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తర్వాత ఆర్టీజీఎస్ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. అక్కడుండే పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తే సరిపోతుందని, పూర్తిగా మూసేస్తూ బారికేడ్లు పెట్టవద్దని సూచించారు. ఇక్కడికంటే పింఛన్ల పంపిణీకి తాను వెళ్తున్న ఊళ్లలోనే ఏర్పాట్లు బాగున్నాయని వ్యాఖ్యానించారు. సచివాలయానికి వచ్చే వారికి ఆహ్లాదకరమైన అనుభూతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సచివాలయ అధికారులు సత్వరమే స్పందించి బారికేడ్లు తొలగించారు. వాటి స్థానంలో పూలకుండీలు ఏర్పాటు చేశారు.






