Chevireddy Bhaskar Reddy: ఏసీబీ కోర్టు లో భావోద్వేగానికి లోనైన చెవిరెడ్డి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కాం (liquor scam) కేసు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో అరెస్టయిన వైసీపీ (YCP) నాయకులు మొదట్లో ఎంత ధైర్యంగా వ్యవహరించారో, ఇప్పుడు అంతే స్థాయిలో ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారనే ప్రచారం వినిపిస్తోంది. గతంలో తాము ఎటువంటి తప్పు చేయలేదని, అధికారంలోకి వచ్చాక అందరికీ అసలు రూపం చూపిస్తామని బహిరంగంగానే హెచ్చరించేవారు. కానీ ఇప్పుడు జైలు జీవితానికి అలవాటు కానందున, బయటపడటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విజయవాడ (Vijayawada) ఎసిబి కోర్టులో రిమాండ్ పూర్తయిన నిందితులను హాజరు పరచగా, ఆ సమయంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy) పరిస్థితి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు జైలు జీవితం భరించలేక పోతున్నాను అని చెప్పుకుంటూ కోర్టులోనే భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు.
సిట్ అధికారులు ఈ కేసులో దాదాపు రూ.250 కోట్ల నిధులు ఎన్నికల్లో ఖర్చు చేశారని, ఆ డబ్బు లావాదేవీలలో చెవిరెడ్డి పాత్ర ఉందని , దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలతోపాటు ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు (Venkatesh Naidu)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే చెవిరెడ్డి మాత్రం ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, తన కుటుంబంలో తండ్రి, సోదరుడు మద్యానికి బలైపోయారని చెబుతూ తాను మద్యం వ్యాపారంలో ఎప్పుడూ భాగస్వామ్యం కాలేదని వాదిస్తున్నారు.
గతంలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు మీడియా ముందు గట్టిగానే మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసులు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “నేనెవరో చూపిస్తా” అంటూ దూకుడుగా అన్నారు. కానీ ఇప్పుడు ఆ ధైర్యం పూర్తిగా కనిపించడం లేదని కోర్టులో ఆయన ప్రవర్తన చూసినవారు అంటున్నారు.
ఇక మంగళవారం రిమాండ్ ముగిసిన సందర్భంగా వర్చువల్ విధానంలోనే కోర్టు విచారణకు హాజరుకావాలని ఆయన విన్నపం చేసినా, న్యాయమూర్తి తిరస్కరించడంతో తప్పనిసరిగా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ న్యాయమూర్తిని చూసిన వెంటనే చెవిరెడ్డి కన్నీళ్లు పెట్టుకుని తనకు తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, జైలులో ఎలాంటి వైద్య సహాయం అందటం లేదని వాపోయారట. అందువల్ల వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు.
అయితే సిట్ అధికారులు బలమైన ఆధారాలతో ఆయనపై కేసు నడుస్తోందని వాదిస్తూ బెయిల్‌ను అడ్డుకుంటున్నారని సమాచారం. దీంతో ఈ నెల 30న ఆయన బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినే అవకాశం ఉందని కోర్టు ప్రకటించింది.ఒకప్పుడు ధైర్యంగా కనిపించిన చెవిరెడ్డి ఇప్పుడు జైలు జీవితం తట్టుకోలేక క్షీణించిన దృశ్యం ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ఆయన అనారోగ్యం కారణంగా బయటకు రావాలన్న తపనతో కన్నీటి పిటిషన్ వేయడం, మరోవైపు సిట్ ఆధారాలను చూపిస్తూ అడ్డుకోవడం రాజకీయంగా పెద్ద సెన్సేషన్ అయింది. ఈ పరిస్థితి ఆయన అనుచరులను కూడా ఆందోళనలోకి నెట్టింది.







