Chandrababu: చంద్రబాబు సర్కార్ కు “శాండ్” జీవో తలనొప్పి..?

కృష్ణా నదిలో ఇసుక తీసే అంశానికి సంబంధించి రాష్ట్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీస్తోంది. ఈ అంశంలో ఉన్నతాధికారులు తీరు ప్రశ్నార్ధకంగా మారుతోంది. అమరావతి(Amaravathi) నిర్మాణం కోసం ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న ఇసుకను తవ్వాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రతీ కట్టడాన్ని పది అడుగుల ఎత్తులో నిర్మించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ కు ఎగువన ఉన్న మట్టి దిబ్బలను తవ్వి, నిర్మాణానికి ఆ మట్టి వాడాలని భావించింది ప్రభుత్వం.
ప్రభుత్వ లెక్కల ప్రకారం కృష్ణా నదిలో కోటీ 40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉందని అంచనా వేసారు. ఆ ఇసుక తీసే బాధ్యతను సిఆర్డిఏ(CRDA) అధికారులకు అప్పగించింది సర్కార్. ఈ మేరకు ఈ నెల 14న రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ జిఓ 678 జారీ చేసింది. ఆ జీవోలో వాడిన ఓ పదం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. శాండ్ డీసిల్టేషన్ అనే పదం వాడింది ప్రభుత్వం. సిడబ్ల్యుసి నిబంధనల ప్రకారం రిజర్వాయర్లు, బ్యారేజీల్లో ఎగువన కనీసం ఐదు కిలోమీటర్ల వరకూ ఇసుకను తీయాలంటే మాత్రు సంస్థలే ఆ పని చేయాలి.
అంటే జలవనరుల శాఖ మాత్రమే ఆ పని చేయాల్సి ఉంటుంది. కానీ పట్టణభివృద్ధి శాఖకు అప్పగించడంతో.. వివాదం అయ్యే అవకాశం ఉంటుంది. దీనితో ఇసుక పూడిక తీతకు సంబంధించి క్యాబినెట్ సమావేశం అనంతరం సిఆర్డిఏ అధికారులు సాధ్యాసాధ్యాలు వివరించాలని జలవనరుల శాఖను కోరారు. జలవనరులశాఖ అధికారులు సలహాదారు నేత్రుత్వంలో నివేదికను తయారు చేసి పంపగా.. ఇసుక తవ్వకానికి సంబంధించి 286 కోట్లు కేటాయిస్తూ జిఓ జారీ చేసారు.
ఇందుకు గానూ టెండర్లు పిలిచేందుకు సిఆర్డిఏ అధికారులు రెడీ అయ్యారు. నదులలో డీ సిల్టింగ్ కు సంబంధించి 2022 అక్టోబరులో కేంద్రం నేషనల్ ఫ్రేం వర్కు ఫర్ సెడిమెంట్ మేనేజ్ మెంట్ ముసాయిదా నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. దాని ప్రకారం 1. సిఎల్ 2.2(5) ప్రకారం అన్ని సాంకేతిక అంశాల అధ్యయనాల తరువాతే డీ సిల్టేషన్, డ్రెడ్జింగ్కు అనుమతి ఇవ్వాలి. 2. అలాగే సిఎల్ 7.4 ప్రకారం సాంకేతిక ఆర్థిక అంశాలపై డిపిఆర్ తయారు చేసి ఆమోదం కోసం సాంకేతిక సలహా కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
3.సిఎల్ 7.1, 7.2 ప్రకారం అవసరమైన పర్యావరణ అనుమతి కూడా కావాలి. వీటి ప్రకారం.. జిఓలో శాండ్ అని పెట్టడం వల్ల భవిష్యత్ లో ఎన్జిటి నుండి అభ్యంతరం వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో మాజీ మంత్రి దివంగత దేవినేని నెహ్రూ 2016లో ఎన్జిటిలో దాఖలు చేసిన కేసు తీర్పును కూడా ఇందులో ప్రస్తావించారు. శాండ్ మైనింగ్ను నేరుగా అంగీకరించే అవకాశం లేదు. కాబట్టి జీవోను డీ సిల్టింగ్ అని మార్చాలి. శాండ్ డీ సిల్టింగ్ అనే పదం ఇబ్బందిని కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.