Jagan: చంద్రబాబు సవాల్, సజ్జల ప్రతిసవాల్..జగన్ అసెంబ్లీ కి వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ (YCP) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనే చర్చ మళ్లీ వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా వర్షాకాల సమావేశాల్లో ఆయన హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారని ప్రచారం సాగింది. ప్రజల సమస్యలపై బలమైన చర్చ జరగాలని వైసీపీ కోరుకుంటోందని పలువురు అనుకున్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ “జగన్ వస్తారా లేదా?” అన్న అనుమానం ఎక్కువైంది.
గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా జగన్ నిర్వహించిన “సిద్ధం సభలు” గుర్తున్నాయి. ఆ సభల్లో “మీరు సిద్ధమేనా?” అని ప్రజలకే ఆయన ప్రశ్నించేవారు. అదే పదాన్ని ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) తన శైలిలో ఉపయోగించారు. “ప్రెస్ మీటింగ్స్ వద్దు, అసెంబ్లీలోకి రండి, సిద్ధమా?” అంటూ ఆయన వైసీపీని నేరుగా సవాలు చేశారు.
ఈ సవాల్‌కి వైసీపీ తరఫున రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) సమాధానం ఇచ్చారు. “మేము సిద్ధమే, కానీ ముందుగా జగన్‌కి ప్రతిపక్ష హోదా ఇస్తారా?” అని తిరుగుబాటు చేశారు. సభలో జగన్ పాల్గొని మాట్లాడాలంటే అధికారిక విపక్ష హోదా ఇవ్వాలని సజ్జల అండర్‌లైన్ చేశారు.
అయితే కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని తిరస్కరిస్తోంది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) కూడా స్పష్టంగా నిబంధనలను గుర్తు చేశారు. కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్ష హోదా ఇవ్వగలమని రూల్స్ చెబుతున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం వైసీపీ వద్ద ఉన్న సంఖ్య ఆ పరిమితికి తక్కువ కావడంతో హోదా ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం వాదిస్తోంది.
ఇక ప్రజల్లో చర్చ వేరే దిశలో సాగుతోంది. “ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాం” అనే వైసీపీ అట్టడుగున డిమాండ్ చేస్తుండటమే సరైన రాజకీయమా అన్న సందేహం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకులే జగన్ అసెంబ్లీకి వెళ్ళడమే వైసీపీకి మేలు చేస్తుందని సూచిస్తున్నారని సమాచారం. 11 మంది ఎమ్మెల్యేలు ప్రజల ఓటుతో గెలిచారనే క్రమంలో, వారు తమ నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని వాదన ఉంది.
వైసీపీ అధినేత సభలో మాట్లాడితే, విమర్శలు ఎదురైనా, అవమానాలు జరిగినా ప్రజల దృష్టిలో పార్టీ బలం పెరిగే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కీలక పాత్ర పోషిస్తుందని వారు సూచిస్తున్నారు. ప్రతిపక్షంగా వైసీపీ వాదనలు అసెంబ్లీలో వినిపిస్తే, భవిష్యత్తులో రాజకీయ లాభాలు ఖచ్చితంగా ఉంటాయని విశ్లేషకుల అంచనా.ఈ నేపథ్యంలో , జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది. ఆయన వస్తే రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారడం ఖాయం.