బాబు వెళ్లడానికి తెలంగాణ ఓకె.. ఆంధ్రలో రాకకు రాని అనుమతి…
భారీ తేడాతో స్వరాష్ట్రంలో ఓటమి పాలై అధికారం కోల్పోయిన తర్వాత తమ తెలుగు దేశం పార్టీని కాపాడుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న మాజీ సిఎం చంద్రబాబునాయుడు… ఓడిపోయినా వెనక్కి తగ్గబోమని ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసుర్తూనే ఉన్నారు. పదవి కోల్పోయి ఏడాదిపైగా కావస్తున్నా ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేదంటూ పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. కొన్ని నెలల క్రితం దాకా రాష్ట్రంలో ప్రతి సమస్యపైనా నేరుగా పోరాడిన చంద్రబాబు కరోనా అనంతర పరిస్థితుల్లో అనుకోకుండా హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి ఆయన కరోనా పై జగన్ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉన్నప్పటికీ అదంతా కేవలం మీడియా సమావేశాల వరకూ అది కూడా తెలంగాణ రాష్ట్రంలో కావడంతో తగినంత ప్రభావం చూపలేపోయింది. మరోవైపు వైసీపీ నేతలు బాబు ఆంధ్ర ప్రజలను విపత్తు సమయంలో గాలికొదిలేశారంటూ విమర్శల దాడి పెంచారు. ఈ నేపధ్యంలో గత కొన్ని రోజులుగా ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్లడానికి పలు రకాల ప్రయత్నాలు చేశారు. కేంద్రానికి కూడా విజ్ఞప్తులు చేశారు. అయితే లాక్ డవున్ ఆంక్షలు కఠినంగా ఉండడంతో ఆయనకు ఎటువంటి వెసులుబాటు లభించలేదు.
ఇప్పుడు తాజాగా లాక్ డవున్ సడలింపులు, అంతర్రాష్ట్ర రవాణాకు, విమానాల రాకపోకలకు కూడా మార్గం సుగమం కావడంతో చంద్రబాబు మరోసారి ఆంధ్రకు బయలు దేరడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన స్వరాష్ట్రానికి వెళ్లడానికి అనుమతి కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిజిపిలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో ఆయన చేసుకున్న దరఖాస్తుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి లభించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాత్రం అధికారిక అనుమతి లభించలేదని సమాచారం. కాస్త అటూ ఇటూ అయినా ఆంధ్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభిస్తుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. అలా లభించినట్టయితే సోమవారం ఆయన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఆయన అనుకున్నట్టు జరిగితే మార్చి 20నుంచి అంటే దాదాపు 2 నెలల తర్వాత ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో అడగుపెట్టనున్నారు. ఓవైపు వైసీపీ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న నేపధ్యంలో ఆ పార్టీ తన విజయాలపై సమీక్షలు, సంబరాలకు సిద్ధమవుతుంటే అదే సమయానికి ఆకలి మీద ఉన్న ప్రతిపక్ష నేత ఆంధ్రప్రదేశ్‌కి వస్తుండడంతో మరోసారి ఎపి రాజకీయాలు గరంగరంగా మారడం తధ్యంగా కనిపిస్తోంది.






