TDP: నేతల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఆగ్రహం..ఫోకస్లో 25 మంది ఎమ్మెల్యేలు..
తెలుగుదేశం పార్టీ (TDP) ప్రస్తుతం తన శ్రేణుల్లో క్రమశిక్షణను బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు ప్రారంభించింది. పార్టీ లెక్క ప్రకారం ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు (MLAs) తమ పనితీరులో స్పష్టమైన మార్పు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పార్టీ ఉన్నత నాయకత్వం, ముఖ్యంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఈ నాయకుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం . జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి అనంతపురం (Anantapur), కర్నూలు (Kurnool), కృష్ణా (Krishna) వంటి పలు ప్రాంతాల నేతలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీకి చేరుతున్న నివేదికల ప్రకారం, ముఖ్యంగా నాలుగు అంశాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదటిది ప్రజల మధ్యకు వెళ్లకపోవడం, వారికి సంబంధించిన కార్యక్రమాలకు సరైన సమయం ఇవ్వకపోవడం. పార్టీ ఎప్పటినుంచో ప్రజాదర్బార్లు (Praja Darbar) నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కార మార్గాలు సూచించాలని ఎమ్మెల్యేలకు సూచిస్తోంది. కానీ కొంతమంది మాత్రం తమ నియోజకవర్గాల్లో కనిపించడమే అరుదుగా మారింది, దీంతో ప్రజలతో అనుసంధానం తగ్గిపోతోందన్న విమర్శలు రావడం సహజం.
రెండవ అంశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడంలో లోపం. ప్రతి నెల 1వ తేదీన అందించే పింఛన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రజలను కలవాడ్ చాలా ముఖ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచిస్తున్నా, కొందరు మాత్రం ఈ కార్యక్రమానికి ఆసక్తి చూపకపోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ కారణంగా అధికారులు మాత్రమే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించే పరిస్థితి ఏర్పడుతోంది.
మూడవ అంశం నియోజకవర్గాలకు దూరంగా ఉండటం. కొంతమంది నేతలు తమ ప్రాంతాలను వదిలి హైదరాబాద్ (Hyderabad) వంటి నగరాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు సమాచారం. ఇటువంటి వ్యవహారం ప్రజా ప్రతినిధుల బాధ్యతలకు విరుద్ధమని పార్టీ భావిస్తోంది. ఇటీవల జరిగిన సమావేశాల్లో ఈ విషయాన్ని చంద్రబాబు గట్టిగా గుర్తు చేసినట్లు తెలుస్తోంది. నాలుగవ అంశం వ్యక్తిగత వ్యాపారాలపై అధిక శ్రద్ధ. కొంతమంది ఎమ్మెల్యేలు రాజకీయాలకు కంటే వ్యక్తిగత వ్యాపారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పార్టీ నేతృత్వం ఆందోళన చెందుతోంది. దీంతో ప్రజాసేవకు కావాల్సిన సమయం, దృష్టి రెండూ తగ్గిపోతున్నాయని సమాచారం.
ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, పార్టీ అధిష్టానం వీరిపై ప్రత్యేక పర్యవేక్షణ ప్రారంభించింది. జిల్లా ఇంచార్జ్లు, నియోజకవర్గ బాధ్యులు, సంబంధిత మంత్రులకు కూడా ఈ నేతల కదలికలపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇకపై పార్టీ విధానాలకు విరుద్ధంగా పనిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని నేతృత్వం సంకేతాలు ఇస్తోంది. మొత్తానికి, ప్రజలతో అనుసంధానం, ప్రజాసేవ, నిష్ట—ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకంగా భావిస్తున్న అంశాలు. నాయకులు ఈ మార్గంలో నడవాలని అధిష్టానం స్పష్టంగా చెబుతోంది.






