Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు 30 ఏళ్లు..!! ఎన్నో మైలురాళ్లు..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) చంద్రబాబు (Chandrababu) ఒక సంచలనం. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు. ఇవాల్టికి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు నాలుగు పర్యాయాలు సీఎంగా పని చేశారు. మొత్తం 14 ఏళ్ల 11 నెలలు (5,442 రోజులు) రాష్ట్రానికి సేవ చేశారు. ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో ఆయన ఎన్నో సంక్షోభాలను అధిగమించారు. హైదరాబాద్‌ను (Hyderabad) ప్రపంచ పటంలో నిలబెట్టడం నుంచి అమరావతిని ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దే వరకు అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
1995లో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, 2004 మే 29 వరకు రెండు పర్యాయాలు (8 ఏళ్ల 8 నెలల 13 రోజులు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో ఆయన హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చారు. హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ రూపురేఖలు మార్చారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయి. చంద్రబాబు రూపొందించిన ‘విజన్ 2020’ కలను సాకారం చేస్తూ, రాష్ట్రాన్ని ఆధునికీకరణ దిశగా నడిపించారు. ఐటీ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు, ప్రతి కుటుంబం నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనేలా బాటలు వేశారు. అంతేకాక, నదుల అనుసంధానానికి ఆయన ఆద్యుడని చెప్పాలి. గోదావరి జలాలను కృష్ణా నదికి తీసుకొచ్చి, కరవును అరికట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. విద్యుత్, ఆర్థిక సంస్కరణల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న చంద్రబాబు మూడోసారి ప్రమాణం చేశారు. 2019 మే 29 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ సమయంలో అమరావతిని (Amaravati) రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. అమరావతిని ఆధునిక, పర్యావరణ హిత నగరంగా రూపొందించేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేశారు. పోలవరం (Polavaram) ప్రాజెక్టు నిర్మాణానికి వేగం పెంచారు. విశాఖపట్నంను ఆర్థిక, ఐటీ రాజధానిగా, రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ కాలంలో ఆయన అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి, సంక్షేమ పథకాలను కూడా సమర్థవంతంగా అమలు చేశారు.
2024 జూన్ 12న నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి మళ్లీ ప్రాధాన్యమిచ్చారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేస్తూ, విశాఖపట్నంను ఆర్థిక, ఐటీ హబ్‌గా, రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపించడం ద్వారా ఆధునిక సాంకేతికతను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉద్భవించేలా కృషి చేస్తున్నారు.
చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలతో పాటు కేంద్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్‌గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆయన తీసుకున్న నిర్ణయాలు రాజకీయ సమీకరణాలను మార్చాయి. అలాగే.. చంద్రబాబు హయాంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. రాష్ట్ర విభజన, ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ అనిశ్చితులను ఎదుర్కొన్న ఆయన, ప్రతి సందర్భంలోనూ సమర్థవంతంగా సమస్యలను పరిష్కరించారు. ఆయన దీర్ఘకాలిక దృష్టి, సంస్కరణలు, ఆధునిక సాంకేతికతను ఆకర్షించే విధానాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాయి.