Chandrababu: సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి చర్చకు సిద్ధమా.. జగన్‌కు చంద్రబాబు సవాల్

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయ్యే వరకు సంక్షేమ పథకాల అమలుపై ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) నాయకులు, ముఖ్యంగా ఒక్క పెన్షన్లు తప్ప మిగిలిన పథకాలేవీ అమలు చేయడం లేదని తీవ్రంగా ఆరోపణలు చేశారు. అయితే గత కొద్ది నెలలుగా ఏపీలో పరిస్థితులు పూర్తిగా మారాయి . సర్వేలలో వచ్చిన హెచ్చరికల ప్రభావమో, లేక ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్న ఉద్దేశమో, ఇచ్చిన వాగ్దానాలకు వనరులు సిద్ధం చేసుకుని స్టార్ట్ చేద్దాము అనే ఉద్దేశం తెలియదు కానీ ,మొత్తానికి విమర్శలకు ఫుల్స్టాప్ పెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వరుసగా సంక్షేమ పథకాలను ప్రారంభించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రారంభమవ్వడంతో ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని చెప్పాలి.
ఈ నేపథ్యంలో రాజంపేట (Rajampet) లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ నాయకులు మాట్లాడితే సిద్ధం.. సిద్ధం.. అంటారని, ఇప్పుడు నేను అడుగుతున్నాను.. మీరు నిజంగా అసెంబ్లీకి రావడానికి సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. ఆయన సవాల్ చేస్తూ, అసెంబ్లీలో అభివృద్ధి, సంక్షేమంపై చర్చించేందుకు మీరెంతగా సిద్ధంగా ఉన్నారో చూపించమన్నారు. అభివృద్ధి జరిగితేనే సంక్షేమం సాధ్యమని, సంపద సృష్టించడం చేతనైతే పథకాలు అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఇక వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య, గులకరాయి (Gulakarayi) ఘటనలపై కూడా అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రశ్నలు విసిరారు. రాజకీయాల్లో తాను ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదని, 30 సంవత్సరాలుగా ఒక లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్నానని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజల జీవితాలను మార్చడం, పేదల గృహాల్లో వెలుగు నింపడం తన పాలనలోని ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం జీతాలతో పాటు పెన్షన్లను కూడా సకాలంలో అందజేస్తోందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే వాస్తవ మార్పులు వస్తాయని, అభివృద్ధి, ఆదాయం పెరగాలంటే కొత్త విధానాలను అనుసరించాల్సిందేనని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమ (Rayalaseema) ప్రాంతాన్ని రత్నాలసీమగా మలచడమే తన కల అని, కానీ గతంలో వైసీపీ అధికారం దక్కించుకున్నప్పటికీ ఆ అవకాశాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటి రాజకీయ వాతావరణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు వైసీపీ విమర్శలు చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం ద్వారా రాజకీయ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం, వివిధ రాజకీయ ఆరోపణలపై అసెంబ్లీలో చర్చలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.